చిలుకూరు ఆలయంలో అద్భుతం.. శుభసంకేతమంటున్న రంగరాజన్
- IndiaGlitz, [Sunday,July 19 2020]
చిలుకూరు బాలాజీ అంటే భక్తులకు అపారమైన నమ్మకం. అక్కడ ఏదైనా అనుకుని 11 ప్రదక్షిణలు చేస్తే అది తప్పక జరిగి తీరుతుందనేది భక్తుల విశ్వాసం. అయితే నేటి ఉదయం బాలాజీ ఆలయంలో అద్భుతం చోటు చేసుకుంది. అది చూసిన ప్రధాన పూజారి రంగరాజన్ ఆనందం వ్యక్తం చేశారు. ఇది కచ్చితంగా శుభ సంకేతమేనన్నారు. అసలేం జరిగిందంటే.. బాలాజీ ఆలయంలోనే శివుని ఆలయం కూడా ఉంటుంది. ఆ ఆలయంలోకి నేడు ఒక తాబేలు ప్రవేశించింది. కనీసం అది ప్రవేశించేందుకు ఎలాంటి మార్గం కూడా లేదు. అయినప్పటికీ ఎలా వచ్చిందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. రోజూ మాదిరిగానే శివునికి పూజ చేసేందుకు వెళ్లిన పూజారి సురేష్ ఆత్మారాం ఆ కూర్మాన్ని గుర్తించారు. విషయాన్ని రంగరాజన్‌కు తెలియజేశారు.
దీనిపై రంగరాజన్ మాట్లాడుతూ.. ఆలయంలోకి ప్రవేశించేందుకు చిన్న మార్గం కూడా లేదని.. అలాంటప్పుడు ఈ కూర్మమూర్తి ప్రవేశం ఓ దివ్యమైన సంకేతమన్నారు. ఈ సందర్భంగా ఆయన కూర్మావతారం ఉద్దేశాన్ని గుర్తు చేశారు. అమృతం కోసం క్షీరసాగరాన్ని మథించినప్పుడు మహావిష్ణువు కూర్మరూపంలో వచ్చాడని.. అప్పుడు ఆ కూర్మంపైనే మేరు పర్వతాన్ని ఉంచి వాసుకిని కవ్వంగా చేసుకుని ఒకవైపు దేవతలు, మరోవైపు అసురులు మథించారని ఆయన వెల్లడించారు. ఇప్పుడు ఆలయంలోకి కూర్మం ప్రవేశించడం.. కోవిడ్ 19పై విజయం పొందడానికి సంకేతమన్నారు. త్వరలోనే వైరస్ అంతమై అమృతం లభిస్తుందని సాక్షాత్తు ఆ వేంకటేశ్వరస్వామి సూచించినట్టు ఉందన్నారు. ప్రతి ఒక్కరి ప్రార్థనలు, కృషి ఫలిస్తుందని రంగరాజన్ పేర్కొన్నారు.