Womens Reservation:3 దశాబ్ధాల నిరీక్షణకు తెర .. మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర , గెజిట్ నోటిఫికేషన్ విడుదల
- IndiaGlitz, [Friday,September 29 2023]
దశాబ్థాలుగా భారతీయ మహిళలు కన కల ఇన్నాళ్లకు నెరవేరింది.. అసాధ్యం అనుకున్న దానిని మోడీ షా ద్వయం సుసాధ్యం చేసి చూపించింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేలా ప్రతిపాదించిన మహిళా రిజర్వేషన్ బిల్లు (నారీ శక్తి వందన్ అధినియమ్)కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమోదముద్ర వేశారు. ఇప్పటికే పార్లమెంట్ ఆమోదం పొందిన ఈ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేశారు. దీంతో మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారింది. సెప్టెంబర్ 19న ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభలో ప్రవేశపెట్టారు. దాదాపు 8 గంటల పాటు బిల్లుపై చర్చ జరగ్గా.. 60 మంది సభ్యులు దీనిపై మాట్లాడారు. బిల్లు అసంపూర్తిగా వుందని.. ఇందులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సబ్ కోటా వుండాలంటూ విపక్ష సభ్యులు పట్టుబట్టారు. దీనికి కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ కౌంటరిచ్చారు. దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేలా కులాల వారీగా కోటా అడగటం సరికాదన్నారు.
అనంతరం స్పీకర్ సభలో ఓటింగ్ నిర్వహించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఎరుపు, ఆకుపచ్చ స్లిప్పుల ద్వారా ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు అనుకూలమైతే ఆకుపచ్చ స్లిప్పుపై ‘‘ఎస్’’ అని, వ్యతిరేకమైతే ఎరుపు రంగు స్లిప్పుపై ‘‘నో’’ అని రాయాలని లోక్సభ సెక్రటరీ జనరల్ వివరించారు. ఓటింగ్లో 456 మంది సభ్యులు పాల్గొనగా.. వీరిలో 454 మంది బిల్లుకు అనుకూలంగా ఓటు వేయగా, ఇద్దరు మాత్రం వ్యతిరేకంగా ఓటు వేశారు. వీరిలో ఒకరు హైదరాబాద్ ఎంసీ అసదుద్దీన్ ఒవైసీ కాగా, మరొకరు ఔరంగాబాద్ ఎంపీ ఇంతియాజ్ జలీల్. ఆ తర్వాత సెప్టెంబర్ 21న రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టగా.. సుదీర్ఘ చర్చ అనంతరం రాజ్యసభ కూడా బిల్లుకు ఆమోదం తెలిపింది.
అయితే 2024 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కాదని, 2029లోనే దీనిని అమలు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సభలో ప్రకటించారు. 2024 ఎన్నికలు ముగిసిన తర్వాత డీలిమిటేషన్ అనంతరం మహిళలకు రిజర్వేషన్ కోటా అమలుకానుంది. ఈ బిల్లుకు ఆమోదం లభించడం వల్ల లోక్సభలో మహిళల సీట్ల సంఖ్య 181కు పెరగనుంది.