అమ్మాయిలు ఫైలట్స్ కాలేరు
- IndiaGlitz, [Thursday,August 29 2019]
నేటి సమాజంలో అమ్మాయిలు పురుషులకు సమానంగా రాణిస్తున్నారు. దేశానికి మంత్రులు, ప్రధాన మంత్రులు అవుతున్నారు. పరిపాలన చేస్తున్నారు. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న మహిళల్లో గుంజన్ సక్సేనా ఒకరు. యుద్ధంలో పనిచేసిన లేడీ ఫైలట్ గుంజన్. ఈమె జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతోన్న చిత్రం 'గుంజన్ సక్సేనా'. 'ది కార్గిల్ గర్ల్' ట్యాగ్ లైన్. గుంజన్ సక్సేనా పాత్రలో జాన్వీకపూర్ నటిస్తున్నారు. 1999కలో జరిగిన కార్గిల్ యుద్ధంలో సైనికులను గాయపడిన సైనికులను సురక్షిత ప్రాంతాలకు తరలించిన గుంజన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2020 మార్చి 13న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. గుంజన్ సక్సేనా యుద్ధంలో చూపిన ధైర్య సాహసాలకు, ఆమె చేసిన సేవలకు భారత ప్రభుత్వం ఆమెను శౌర్య చక్ర అవార్డుతో సత్కరించింది.
దివంగత తార శ్రీదేవి తనయ జాన్వీకపూర్ 'దఢక్' సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈమె నటిస్తోన్న 'గుంజన్ సక్సేనా.. ది కార్గిల్ గర్ల్' రెండోది. రియల్ లైఫ్ క్యారెక్టర్‌ను తెరపై ఆవిష్కరించడం అంత సులభం కాదు. అయితే కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి క్యారెక్టర్‌ను జాన్వీ చేయనుండటం ఓ రకంగా గొప్ప విషయమే. కరణ్ జోహార్ ఈరోజు సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు 'ఆడపిల్లలు ఫైలట్లు కాలేరు. కానీ ఆమెకు ఎగరాలని ఉంది' అనే క్యాప్షన్ ఇచ్చారు. అలాగే జాన్వీకపూర్ సినిమాకు సంబంధించిన మూడు పోస్టర్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా విడుదల చేసింది. శరణ్ శర్మ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నాయి. జాన్వీ మరో వైపు 'తక్త్' సినిమాలోనూ నటిస్తుంది.