ఘోరం.. ఆఫీసులోనే మహిళా ఎమ్మార్వో దారుణ హత్య.. అసలేమైంది!?
- IndiaGlitz, [Monday,November 04 2019]
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో దారుణం జరిగింది. తహశీల్దార్ విజయారెడ్డిని ఓ దుండగుడు అతి దారుణంగా హత్య చేశాడు. పూర్తి వివరాల్లోకెళితే.. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో అందరూ అన్నం తినడానికి వెళ్లడంతో జనాలు లేని టైమ్‌లో ఎంటరైన ఓ దుండుగుడు ఎమ్మార్వోపై పెట్రోలు పోసి తగులబెట్టాడు. ఎమ్మారర్వో కార్యాలయంలోనే సజీవదహనం చేయడం తెలుగు రాష్ట్రాలను కుదిపివేసింది. ఎమ్మార్వోపై దాడిని అడ్డుకునేందుకు ఇద్దరు రెవెన్యూ ఉద్యోగులు ప్రయత్నించగా వారికి కూడా గాయాలయ్యాయి. కాగా.. అనంతరం తనకు తానుగా పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. తహశీల్దార్‌పై దారుణానికి పాల్పడిన అనంతరం తనకు తానుగా ఆ దుండగుడు పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్ర గాయాలతో ఉన్న దుండగుడ్ని, ఇద్దరు రెవెన్యూ ఉద్యోగులను స్థానికులు, పోలీసులు ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. నిప్పు అంటించగానే విజయ కేకలు వేసుకుంటూ బయటికి వచ్చారు. అయితే మంటలు వ్యాపించడంతో ఆమె కుప్పకూలిపోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఒకరి పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అసలేం జరిగింది!?
విజయారెడ్డితో మాట్లాడాలంటూ ఓ వ్యక్తి ఆఫీసులోపలికి వెళ్లాడు. సుమారు అరగంటపాటు చర్చించారు. అనంతరం ఒంటిపై మంటలతో విజయారెడ్డి బయటకు వచ్చారు. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. కానీ.. తీవ్రగాయాలపాలై ఆమె తహశీల్దార్ కార్యాలయంలోనే మృతిచెందారు. ఇంతటి దారుణానికి పాల్పడటానికి ఎమ్మార్వో వేధింపులే కారణమని తెలుస్తోంది. పొలం రిజిస్ట్రేషన్ విషయంలో ఎమ్మార్వో లంచం ఇవ్వాలని వేధించినట్లు సమాచారం. దీంతో తాను డబ్బులివ్వలేనని చెప్పినప్పటికీ ఎమ్మార్వో ససేమీరా అనడం.. రిజిస్ట్రేషన్ విషయమై రోజుల తరబడి తిరిగిన ఆ వ్యక్తి విసుగుచెంది ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం.
ఎవరా దుండగుడు!?
కాగా.. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిని సురేశ్‌గా పోలీసులు గుర్తించారు. గౌరెల్లి గ్రామవాసి. కాలిన గాయాలతో ఉన్న ఆ వ్యక్తి ప్రస్తుతం హయత్ నగర్ పోలీసులు అదుపులో ఉన్నాడు. హత్యకు గురైన విజయారెడ్డి స్వగ్రామం శాలిగౌరారం మండలం పెరకకొండారం. మరోవైపు, విజయ హత్యపై రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, ఉద్యోగులకు రక్షణ కల్పించాలని రెవెన్యూ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
రంగంలోకి దిగిన మంత్రి సబిత!
అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో సజీవదహనం సంఘటన బాధాకరమని, నిందితులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ‘ప్రజల కోసం పనిచేసే అధికారులపై ఇలాంటి కిరాతకాలకు పాల్పడడం సరికాదు. ఎమ్మార్వో తీరు నచ్చకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి తప్ప ప్రాణాలు తీసేంత దారుణాలకు ఒడిగట్టడం సబబు కాదు. దీనివెనుక ఏంజరిగిందన్న విషయం పూర్తిగా తెలుసుకోవాలని అధికారులను ఆదేశించాం. కలెక్టర్‌తో కూడా మాట్లాడాం’ అని సబిత మీడియా వెల్లడించారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.