రానాతో మాత్రమే వెంటవెంటనే..
- IndiaGlitz, [Thursday,May 10 2018]
దర్శకుడిగా తన తొలి సినిమా అయిన ‘చిత్రం’తోనే ఘన విజయాన్ని అందుకున్నారు తేజ. ఆ తరువాత వచ్చిన ‘నువ్వు నేను’, ‘జయం’ సినిమాలతో ఈ దర్శకుడి గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. అయితే.. ఆ తరువాత వరుస ఫ్లాపుల కారణంగా చాలా కాలం సక్సెస్ కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో గతేడాది ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా రూపంలో మళ్ళీ విజయం వరించింది. రానా, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమాతో మళ్ళీ సక్సెస్ బాట పట్టారు తేజ. ప్రస్తుతం తన తదుపరి చిత్రం మళ్ళీ రానాతోనే ప్లాన్ చేసుకుంటున్నారు ఈ దర్శకుడు. ఈ చిత్రం దాదాపు రూ.50 కోట్ల బడ్జెట్‌తో.. 1971 ఇండో పాక్ యుద్ధం నేపథ్యంలో రూపుదిద్దుకోబోతోందని సమాచారం.
తేజ కెరీర్‌ను ఒక్కసారి గమనిస్తే.. ఆయన ఇంతవరకు ఉదయ్ కిరణ్, నితిన్‌తో మాత్రమే రెండు సార్లు లేదా అంతకు మించి సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. వాటిలో ఉదయ్ కిరణ్‌తో మూడు సినిమాలు (‘చిత్రం’ (2000), ‘నువ్వు నేను’ (2001), ‘ఔనన్నా కాదన్నా’ (2005)), అలాగే.. నితిన్‌తో (‘జయం’ (2002), ‘ధైర్యం’ (2005)) రెండు చిత్రాలు చేశారు. అవి కూడా వారితో వెంట వెంటనే తెరకెక్కించినవి కావు. అయితే.. రానాతో మాత్రం బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలను ఆయన తెరకెక్కిస్తుండడం విశేషం. మరి ఉదయ్ కిరణ్ లాగే రానా కూడా రెండోసారి విజయాన్ని అందుకుంటారో లేదో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.