ఊటీ, బెంగుళూరులో విన్నర్..!
- IndiaGlitz, [Saturday,November 26 2016]
సాయిధరమ్‌తేజ్ - రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం విన్నర్. ఈ చిత్రాన్ని లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బేబి భవ్య సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం ఫారిన్ షెడ్యూల్ పూర్తయింది.
ఈ సందర్భంగా దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ...షూటింగ్ అంతా ముందుగా అనుకున్న ప్రకారం సాగుతోంది. నవంబర్ 3 నుంచి 20 వరకు ఉక్రెయిన్‌లో పాటల్ని తీశాం. సాయిధరమ్‌తేజ్, రకుల్ ప్రీత్‌సింగ్ పై రెండు పాటల్ని, సాయిధరమ్‌తేజ్, యాంకర్ అనసూయ మీద ఒక పాటను చిత్రీకరించాం. రాజు సుందరం కొరియోగ్రఫీ చేశారు. రామజోగయ్యశాస్త్రి, అనంతశ్రీరామ్, శ్రీమణి పాటలను రాశారు. టర్కీలోని ఇస్తాంబుల్‌లో క్లైమాక్స్ కి సంబంధించిన యాక్షన్ పార్ట్ ను చిత్రీకరించాం. బల్గేరియన్ ఫైట్ మాస్టర్ కలయాన్ ఆధ్వర్యంలో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించాం.
'బాహుబలి'లో మంచు కొండల్లో జరిగే యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరించింది కలయాన్ కావడం విశేషం. డిసెంబర్ 6 నుంచి 22 రోజుల పాటు ఊటీ, బెంగుళూరులో షెడ్యూల్ జరుగుతుంది. అక్కడ కీలకమైన టాకీ, యాక్షన్ పార్టును తెరకెక్కిస్తాం. జనవరిలో బ్యాలన్స్ టాకీ, రెండు పాటలను చిత్రీకరిస్తాం. దాంతో సినిమా మొత్తం పూర్తవుతుంది. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 24న చిత్రాన్ని విడుదల చేస్తాం. సినిమాలోని ప్రతి ఫ్రేమూ గ్రాండ్‌గా ఉంటుంది. సాయిధరమ్‌తేజ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంట చక్కగా కుదిరింది. తమన్ మంచి బాణీలనిస్తున్నారు. అబ్బూరి రవి, శ్రీధర్ సీపాన రచన ఆకట్టుకుంటుంది. వెలిగొండ శ్రీనివాస్ మంచి కథనిచ్చారు అని తెలిపారు.
నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు మాట్లాడుతూ....తనకు జన్మనిచ్చిన తండ్రిని, మనసిచ్చిన అమ్మాయిని గెలవడం కోసం ఓ యువకుడు పోరాటం చేస్తాడు. అందులో గెలిచి 'విన్నర్'గా ఎలా నిలిచాడనేది ఈ చిత్ర కథ. ఇప్పటివరకు చిత్రీకరించిన విజువల్స్ చాలా బాగా వచ్చాయి. మంచి లొకేషన్లలో తెరకెక్కించాం. అలాగే తమన్ చాలా మంచి సంగీతాన్నిచ్చారు. ఐదు పాటలు, ఒక బిట్ సాంగ్ ఉంటాయి. అన్ని వర్గాల వారికీ నచ్చేలా సినిమాను తీర్చిదిద్దుతున్నాం అని అన్నారు.
సాయిధరమ్‌తేజ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, ముకేష్ రుషి, అలి, వెన్నెలకిశోర్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: చోటా.కె.నాయుడు, సంగీతం: తమన్, ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి, ఆర్ట్: ప్రకాష్, ఫైట్స్: రవివర్మ, కథ: వెలిగొండ శ్రీనివాస్, రచన: అబ్బూరి రవి, శ్రీధర్ సీపాన, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోపీచంద్ మలినేని.