Download App

Winner Review

మెగా కుటుంబం నుండి ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన హీరోల్లో మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ ఒక‌డు. తొలి సినిమా రేయ్‌ను మిన‌హాయిస్తే పిల్లా నువ్వులేని జీవితం, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌, సుప్రీమ్ సినిమాల‌తో వ‌రుస విజ‌యాలు అందుకున్నాడు. అయితే తిక్క సినిమా డిజాస్ట‌ర్‌తో ఖంగుతిన్న తేజు..ఎలాగైనా స‌క్సెస్ కొట్టాల‌నే గోల్‌తో చేసిన సినిమాయే `విన్న‌ర్‌`. డాన్  శీను, బ‌లుపు వంటి క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌తో స‌క్సెస్ కొట్టిన డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని చేసిన మ‌రో క‌మ‌ర్షియ‌ల్ సినిమా ఇది. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు సినిమాల్లో హీరో..హార్స్ రైడింగ్ స‌న్నివేశాల‌ను ఒక‌ట్రెండింటిలో చూస్తాం. కానీ విన్న‌ర్ సినిమా హార్స్ రేస్ బ్యాక్ డ్రాప్‌లోనే తెర‌కెక్కింది. మరి ఈ విన్నర్ తో తేజు సక్సెస్ కొట్టాడా? లేదా? అని తెలుసుకోవాలంటే సినిమా కథ తెలుసుకుందాం...

కథ:

హార్స్‌ రేసింగ్‌లతో కోట్లు సంపాదించిన ముఖేష్‌ రుషి తన కొడుకు మహేందర్‌(జగపతిబాబు)ను తన పార్ట్‌నర్‌ కూతురు(సోనియా అగర్వాల్‌)కు ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటాడు. కానీ మహేందర్‌ తను ప్రేమించిన లక్ష్మి(కళ్యాణి)ని పెళ్లి చేసుకుని తండ్రితో గొడవపడి ఇంట్లో నుండి వచ్చేస్తాడు. సిద్ధార్థ్‌(సాయిధరమ్‌ తేజ్‌)కు జన్మనిచ్చిన లక్ష్మి చనిపోతుంది. తల్లి లేని కొడుకు మహేందర్‌ చాలా ప్రేమగా పెంచుకుంటూ ఉంటాడు. ఈలోపు మహేందర్‌ తండ్రి వ్యాపారంలో నష్టపోతాడు. స్నేహితుల సలహాతో కొడుకు మహేందర్‌ను, అతని కొడుకు అంటే మనవడు సిద్ధార్థ్‌ను రమ్మని పిలుస్తాడు. బంధాలకు విలువ ఇచ్చే మహేందర్‌ తండ్రి దగ్గరకు చేరుతాడు. అయితే మహేందర్‌ తండ్రి మాత్రం చెడు ఆలోచనలతో..సిద్ధార్థ్‌ను, మహేందర్‌ నుండి దూరం చేసి, మహేందర్‌కు రెండో పెళ్ళి చేస్తాడు. కానీ తన తండ్రి మహేందర్‌ను అర్థం చేసుకోలేని సిద్ధార్థ్‌ తండ్రి నుండి దూరంగా పారిపోతాడు. పెరిగి పెద్దవాడైన సిద్ధార్థ్‌ న్యూలుక్‌ అనే మేగజైన్‌లో క్రియేటివ్‌ హెడ్‌గా పనిచేస్తుంటాడు...సిద్ధు అసిస్టెంట్‌ పద్మ(వెన్నెలకిషోర్‌). ఓ పార్టీకి వెళ్ళిన సిద్ధార్థ్‌ అక్కడ సితార(రకుల్‌ ప్రీత్‌ సింగ్‌)ను చూసి ఆమెతో ప్రేమలో పడతాడు. అథ్లెట్‌ అయిన సితార..రన్నింగ్‌ రేసులో గోల్డ్‌ మెడల్‌ గెలవాలనే లక్ష్యంతో ఉంటుంది. సితార తండ్రి(సురేష్‌)కి ఆమె లక్ష్యం తెలియదు..పెద్దగా పట్టదు. తన స్టడ్‌ హోంను చూసుకోగల కుర్రాడితో సితార పెళ్ళి చేయాలని అనుకుంటూ ఉంటాడు. ఓసారి తాగిన మత్తులో సిద్ధార్థ్‌..సితార తండ్రితో సితార గురించి నిజం చెప్పేస్తాడు. సితార తండ్రి..ఆమెకు ఇష్టం లేని పెళ్ళి కుదురుస్తాడు. పెళ్ళికి వెళ్లిన సిద్ధు అక్కడ మహేందర్‌రెడ్డి కొడుకు సిద్ధార్థ్‌గా ఉన్న తన స్థానంలో ఉన్న ఆది(అనూప్‌ సింగ్‌)ని చూస షాకవుతాడు. అనుకోకుండా సితార సిద్ధార్థ్‌ పెద్ద జాకీ అని..అతన్ని గెలిస్తేనే తాను ఆదిని పెళ్ళి చేసుకుంటానని చెప్పి సిద్ధార్థ్‌ను ట్రాక్‌లోకి తెస్తుంది. ఇంతకు సితార అలా ఎందుకు చెబుతుంది? ఇంతకు ఆది ఎవరు? అసలు ఆది సిద్ధార్థ్‌ స్థానంలోకి ఎందుకు వస్తాడు? మహేందర్‌కు సిద్ధార్థ్‌ తన కొడుకు అనే విషయం తెలుస్తుందా? సిద్ధార్థ్‌ రేసులో గెలుస్తాడా అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

ప్లస్‌ పాయింట్స్‌:

- నటీనటుల పెర్‌ఫార్మెన్స్‌
- సినిమాటోగ్రఫీ
- సంగీతం
- హార్స్‌ రైడింగ్‌ క్లైమాక్స్‌

మైౖనస్‌ పాయింట్స్‌:

- కామెడి అనుకున్న రేంజ్‌లో పండకపోవడం
- ఫస్టాఫ్‌లో బలమైన కథ కనపడదు..సినిమా సాగదీతగా ఉండటం
- బలమైన ఎమోషన్స్‌ లేకపోవడం

సమీక్ష:
ముందుగా నటీనటుల విషయానికి వస్తే..కమర్షియల్‌ సినిమాతో తన రేంజ్‌ను మరింత పెంచుకోవాలన్న తేజు తపన తెరపై కనపడుతుంది. ఫైట్స్‌, డ్యాన్స్‌ల్లో అదరగొట్టాడు. తన పాత్రకు ఫుల్‌ ఎనర్జీతో న్యాయం చేశాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే భజరంగభళీ..సాంగ్‌, క్లైమాక్స్‌లో వచ్చే హార్స్‌ రేసింగ్‌ సీన్‌లో తేజు కష్టం స్క్రీన్‌పై కనపడింది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ లుక్స్‌ పరంగా బావుంది. తన గత చిత్రాల కంటే విన్నర్‌లో రకుల్‌ గ్లామర్‌ డోస్‌ పెంచింది. ఇక తండ్రి పాత్రలోనటించిన జగపతిబాబు తాను తప్ప మరెవరూ ఆ పాత్ర చేయలేరనేలా చాలా సింపుల్‌గా చేసేశాడు. హీరో అసిస్టెంట్‌గా పద్మ పాత్రలో వెన్నెల కిషోర్‌ నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇక సింగం సుజాత అనే పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ పాత్రలో పృథ్వీ కామెడి ఇంతకు ముందు సినిమాల్లో స్పూఫ్‌ల తరహాలో నవ్వించే ప్రయత్నం చేశాడు. కానీ వీరి కామెడియే సినిమా ఫస్టాఫ్‌కు కీలకమవుతుందనుకున్నారు కానీ వీరి కామెడి పెద్దగా పేలలేదు. ఇక సెకండాఫ్‌లో హార్స్‌మెన్‌ బాబు అంటూ హార్స్‌ ట్రైనర్‌గా అలీ చేసిన కామెడి ఆడియెన్స్‌ను నవ్విస్తుంది. ముఖేష్‌ రుషి, సోనియా అగర్వాల్‌, సమ్మెట గాంధీ సహా అందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. ఇక సెకండాఫ్‌లో హీరో విలన్స్‌తో చేసే ఛాలెంజ్‌లు అన్నీ కమర్షియల్‌ పంథాలో అభిమానులను అలరిస్తాయి. ఇక టెక్నిషియన్స్‌ విషయానికి వస్తే..దర్శకుడు గోపీచంద్‌ మలినేని విన్నర్‌ను అవుటండ్‌ అవుట్‌ కమర్షియల్‌గా తెరకెక్కించడానడంలో సందేహం లేదు. అయితే ఫస్టాఫ్‌ విషయంలో కాస్తా జాగ్రత్త తీసుకుని ఉండాల్సింది. ఫస్టాఫ్‌లో కామెడి ట్రాక్‌ ఎఫెక్టివ్‌గా లేకపోవడంతో సినిమా వేగంగా లేకుండా ఢీలా పడింది. అసలు కథంతా సెకండాఫ్‌లో ఉంటుంది. హీరో తండ్రి ప్రేమను గెలవడానికి హార్స్‌ రైడింగ్‌ నేర్చుకోవడం..గెలవడం విషయాలను దర్శకుడు చక్కగా తెరకెక్కించాడు. సెకండాఫ్‌లో అలీ కామెడి నవ్విస్తుంది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ ఎప్పటిలాగానే మ్యూజిక్‌ ఇవ్వకుండా కాస్తా సౌండింగ్‌ తగ్గించినా..ట్యూన్స్‌ మాత్రం వినసొంపుగా లేవు. అనసూయ స్పెషల్‌సాంగ్‌ అయినా, క్లైమాక్స్‌ వచ్చే సాంగ్‌ ఇలా అన్నీ రెండు,మూడు లైన్స్‌ మాత్రమే బావున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌కూడా సో సోగానే ఉంది.  మెలోడి సాంగ్‌ సితార ఓ సితార అంటూ సాగే పాట బావుంది. భజరంగ భళీ, నా బిసి సెంటర్‌లో పాట మాస్‌కు నచ్చుతాయి. ఇక ఛోటా సినిమాటోగ్రఫీ సూపర్బ్‌. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఛోటా కెమెరా పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. ప్రతి సీన్‌ను గ్రాండ్‌గా చూపించే ప్రయత్నం చేశాడు. వెలిగొండ కథ ఓకే. అబ్బూరి రవి సంభాషణలు అక్కడక్కడా మెరిశాయంతే. అనసూయ చేసిన స్పెషల్‌ సాంగ్‌ చూసి..సాంగ్‌కు ఇచ్చిన రేంజ్‌కు తేడా కనపడుతుంది. తేజు తన మావయ్యలు చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌ సహా రేసుగుర్రం, నాన్నకుప్రేమతో వంటి సినిమాల పేర్లను ఉపయోగించి అందరి అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. హార్స్‌ రైడింగ్‌ సీన్స్‌ అందరినీ మెప్పిస్తుంది. ప్రవీణ్‌పూడి ఎడిటింగ్‌ బావుంది. ప్రకాష్‌ ఆర్ట్‌ వర్క్‌తో సినిమాను రిచ్‌గా కనపడేలా చేశాడు.

బోటమ్‌ లైన్‌: విన్నర్‌... రొటీన్‌కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ 

Winner English Version Movie Review

Rating : 2.5 / 5.0