మీడియాలో వైసీపీ రాజ్యసభ అభ్యర్ధుల లిస్ట్ చక్కర్లు .. అలీకి ‘గుడ్‌న్యూస్’ లేనట్లేనా..?
- IndiaGlitz, [Saturday,May 14 2022]
త్వరలో దేశవ్యాప్తంగా ఖాళీ అవబోతున్న 57 రాజ్యసభ స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమీషన్ షెడ్యూల్ విడుదల చేసింది. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయ్యే నాలుగు స్థానాలు కూడా ఉన్నాయి. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం జూన్ 21తో ముగియనుంది. వీరిలో విజయసాయిరెడ్డి , సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్‌లు, సురేష్ ప్రభులు ఉన్నారు. విజయసాయి రెడ్డి వైసీపీకి చెందిన వారు కాగా.. సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్‌లు టీడీపీ నుంచి గెలుపొంది బీజేపీలో చేరారు. ఇక, బీజేపీ నేత సురేష్ ప్రభును అప్పటి టీడీపీ - బీజేపీ పొత్తులో భాగంగా చంద్రబాబు రాజ్యసభకు పంపారు.
ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న సంఖ్యా బలం రీత్యా నాలుగు రాజ్యసభ స్థానాలు వైసీపీ ఖాతాలోకి వెళ్లనున్నాయి. అయితే వీటిని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఎవరికి కేటాయిస్తారనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. వైసీపీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. నాలుగు పేర్లు మీడియా వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కుటుంబంలో ఒకరికి వైసీపీ తరఫున రాజ్యసభ బెర్త్ ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఇటీవల జగన్ ఢిల్లీ పర్యటన సందర్భంగా అదానీకి వైసీపీ రాజ్యసభ టికెట్ ఇచ్చే విషయంపై అమిత్ షా అభ్యర్ధన మేరకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీ తరఫున గౌతమ్ అదానీ లేదా ఆయన భార్య ప్రీతి అదానీకి టికెట్ కన్ఫర్మ్ చేసినట్లుగా సమాచారం.
ఇక వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిని యథావిధిగా రాజ్యసభకు పంపనున్నారు జగన్. మిగిలిన రెండు స్థానాల్లో ఒకటి నెల్లూరు జిల్లాకు చెందిన బీసీ నేత బీద మస్తాన్‌రావుకు, నాలుగో స్థానాన్ని సీఎం జగన్ తన తరఫున కేసులు వాదిస్తున్న న్యాయవాది నిరంజన్‌రెడ్డికి కేటాయించే అవకాశం ఉందని వైసీపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అంతా బాగానే వుంది కానీ లిస్ట్‌లో ఎక్కడా నటుడు అలీ పేరు లేకపోవడం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో సీఎంను కలిసిన అలీకి త్వరలో గుడ్‌న్యూస్ చెబుతానని జగన్ హామీ ఇచ్చారు. అది రాజ్యసభ పదవేనని మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. అలీ కూడా దీనిపై ఆశలు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. జగన్ ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనకడుగు వేయరని అలీ కూడా నిశ్చింతగా వున్నారు. కానీ పరిస్ధితులు చూస్తుంటే అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి.
రాజ్యసభ కోసం వైసీపీలో ఆశావహులు చాలా మందే వున్నారు. వీరందరూ జగన్‌పై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. పార్టీ పెట్టిన నాటి నుంచి జెండా మోస్తున్నామని.. తమకు అన్యాయం చేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు జాతీయ స్థాయిలో బీజేపీతో అవసరాలను దృష్టిలో పెట్టుకుని జగన్ కర్రా వీరగకుండా పాము చావకుండా వ్యవహరిస్తున్నారు. అయితే చివరి నిమిషంలో లిస్ట్‌లో మార్పులు జరిగే అవకాశం కూడా లేకపోలేదు. అప్పుడు అలీని జగన్ పరిగణనలోనికి తీసుకుంటారని, లేనిపక్షంలో నామినేటెడ్ పోస్ట్‌తో సరిపెడతారంటూ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.