జగన్.. తన లెఫ్ట్, రైట్ ఇద్దరికీ మంత్రి పదువులివ్వరా!?
Send us your feedback to audioarticles@vaarta.com
వైఎస్ జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు తమ పదవులకు సైతం రాజీనామా చేసి ఆయన వెంట నడిచిన ఆ ఇద్దరికీ మంత్రి పదవులు లేనట్టేనా..? ఆ జిల్లా నుంచి ఇప్పటికే సీనియర్లు ఉండటం.. పైగా ఉద్ధండులు, సామాజిక సమీకరణాల దృష్ట్యా చేసేదేమీ లేక ప్రస్తుతానికి ఆ ఇద్దర్నీ జగన్ పక్కనెట్టేశారా..? అంటే ప్రస్తుతం అమరావతిలో జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఇదే పక్కాగా వారిద్దరికి మంత్రి పదవులు లేనట్టేనని తెలుస్తోంది. అసలు ఆ ఇద్దరెవరు..? ఎందుకు జగన్ వారిద్దర్ని పట్టించుకోవట్లేదు..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
అప్పట్లో జగన్ లెఫ్ట్.. రైట్ వీరే!
కాంగ్రెస్‌కు టాటా చెప్పేసి జగన్ బయటికొచ్చిన తర్వాత ఆయనతో పాటు ముందుగా అడుగులేసిన వారు.. కడప జిల్లాకు చెందిన గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఆకేపాటి అమరనాథ్ రెడ్డి. వీరిద్దరూ జగన్‌కు ఒకరు రైట్, మరొకరు లెఫ్ట్ హ్యాండ్‌గా అప్పట్లో ఉన్నారు. ఆ తర్వాతే ఒకరు తర్వాత ఒకరుగా జగన్ కోటరీలోకి చేరుకున్నారు. అయితే ఎంత మంది జగన్ వెంట నడిచినా గడికోట, ఆకేపాటి మాత్రం ఆప్తులుగా జగన్ మనసులో చోటు సంపాదించుకున్నారు. ఒకటి రెండు కాదు ఏకంగా 10 ఏళ్ల జగన్ సీఎం కల నెరవేరింది. ‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే నేను..’ అని ప్రమాణ స్వీకారం కూడా చేసేశారు. ఇక మిగిలిందల్లా మంత్రుల ప్రమాణ స్వీకారమే.
ఇద్దరూ ఉద్ధండులే..!
కాగా.. రాయచోటి నియోజకవర్గం నుంచి ఒకట్రెండు కాదు ఏకంగా నాలుగు సార్లు (ఉపఎన్నికలు సహా) ఎమ్మెల్యేగా గెలిచి తిరుగులేని నేతగా పేరుగాంచారు. మరోవైపు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కూడా 2009లో ఎమ్మెల్యేగా గెలిచి.. 2014లో టీడీపీ అభ్యర్థి మేడా మల్లికార్జున్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో ఆకేపాటి ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పటికీ అనుకోకుండా మేడా వైసీపీ తీర్థం పుచ్చుకోవడం.. ఆ టికెట్‌ను జగన్ ఆయనకు కేటాయించడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే అప్పట్లో ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి లేదా నామినేటెడ్ పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారట.
ఇద్దరిలో ఒకరి పేరైనా ఉంటుందా..!?
అయితే జూన్-08న మంత్రి వర్గ విస్తరణ జరగనుండటంతో అసలు గడికోట, ఆకేపాటి పేర్లు ఆ జాబితాలో ఉంటాయా..? లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు జిల్లా నుంచి చాలా వరకు ఎమ్మెల్యేలంతా రెండు, మూడు, వరుసగా హ్యాట్రిక్, నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలే ఉన్నారు. పైగా సొంత జిల్లా కావడంతో అసలు ఎవరెవర్ని కేబినెట్లోకి తీసుకోవాలో జగన్ ఒకింత ఆలోచనలో పడ్డారట. శ్రీకాంత్ రెడ్డి మాత్రం పక్కాగా మంత్రి పదవి ఇచ్చినప్పటికీ అమర్‌కు మాత్రం ఇప్పట్లో ఉండకపోవచ్చని.. కాస్త ఆలస్యమైనా కచ్చితంగా ఆప్తులకు న్యాయం చేస్తారని.. జగన్ మాట ఇస్తే మడమ తిప్పరని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే జగన్ కేబినెట్లో పనిచేసే అదృష్టం ఉండే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఎవరో తెలియాలంటే జూన్-08 వరకు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout