వారి బాటలోనే విక్రమ్ వెళుతున్నాడా?

  • IndiaGlitz, [Friday,May 13 2016]

ప్ర‌స్తుతానికి తెలుగులో ఆ ట్రెండ్ లేదు కానీ.. త‌మిళంలో ఓ ట్రెండ్ కొన‌సాగుతోంది. అదేమిటంటే.. ఒకే సినిమాలో హీరోగానూ, విల‌న్‌గానూ టాప్ హీరోలు రాణించ‌డం. ఆ మ‌ధ్య 'రోబో'లో ర‌జ‌నీకాంత్‌, 'ద‌శావ‌తారం'లో క‌మ‌ల్ హాస‌న్‌, 'వాలి'లో అజిత్‌, 'అళ‌గియ త‌మిళ మ‌గ‌న్' (తెలుగులో 'మ‌హాముదురు')లో విజ‌య్‌.. తాజాగా '24'లో సూర్య క‌థానాయ‌కుడుగానూ, ప్ర‌తినాయ‌కుడుగానూ ఒకే సినిమాలో సంద‌డి చేసి మెప్పించారు.

ఇక ఇప్పుడు ఈ వ‌రుస‌లోనే చియాన్ విక్ర‌మ్ కూడా చేర‌నున్నాడ‌ని కోలీవుడ్‌లో క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. 'ఇరుముగ‌న్' పేరుతో ఆనంద్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు విక్ర‌మ్‌. న‌య‌న‌తార‌, నిత్యా మేన‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ సినిమా ఆగ‌స్టులో విడుద‌ల‌య్యే అవ‌కాశ‌ముంది. ఈ చిత్రంలో తొలిసారిగా ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడు విక్ర‌మ్‌.

అందులో ఒక పాత్ర సిబిఐ కాగా, మ‌రొక‌టి లింగ మార్పిడి చేసుకున్న యువ‌కుడు పాత్ర. వీటిలో ఒక‌టి పాజిటివ్ అయితే, మ‌రొక‌టి నెగెటివ్ అని స‌మాచారం. మొత్తమ్మీద త‌మిళ అగ్ర క‌థానాయ‌కులంద‌రూ ఒకే సినిమాలో హీరోగానూ, విల‌న్‌గానూ రెండు పాత్ర‌లు చేసి మెప్పిస్తున్న వైనం విక్ర‌మ్‌తోనూ కొన‌సాగుతుంద‌న్న‌మాట‌. తెలుగులోనూ 'ఇరుముగ‌న్' విడుద‌ల‌య్యే అవ‌కాశం లేక‌పోలేదు.