త్రివిక్రమ్ ఈసారైనా ఆ క్రెడిట్ ఇస్తారా!
- IndiaGlitz, [Wednesday,March 21 2018]
మనకి నచ్చిన వారిని అనుసరించినా.. వారిని అనుకరిస్తున్నట్టే ఉంటుంది. ఇప్పుడు ఇదే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌లో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. త్రివిక్రమ్ పుస్తకాల పురుగు అని అందరికీ తెలిసిందే. నవలలంటే పిచ్చి. అది కూడా మధుబాబు నవలలంటే మరీనూ. ఆయన రాసిన నవలలన్నీ త్రివిక్రమ్ చదివేశారంటే.. మధుబాబు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు.ఓసారి ఆయన్ని వెతుక్కుంటూ వెళ్లి, మరీ కలిసొచ్చారు. అప్పటినుంచి ఇద్దరూ మంచి స్నేహితులైపోయారు.
ఇదిలా ఉంటే.. మధుబాబు నవలల ప్రభావం త్రివిక్రమ్ పైన బాగానే ఉంది. తను రూపొందించిన ‘అతడు’ సినిమాలోని కొన్ని సీన్స్ మధుబాబు నవలల స్ఫూర్తితో తీసినవే అని త్రివిక్రమ్ చెప్పారు కూడా. ప్రస్తుతం ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా కూడా మధుబాబు నవలాధారంగా తెరకెక్కిస్తున్నారని వార్తలు వినిపించాయి.
అయితే ఈ నేపథ్యంలో మధుబాబు స్పందించి, త్రివిక్రమ్ నన్ను కలవలేదు, నన్ను కథ గురించి అడగలేదు.. నా కథను సినిమాగా తీయడం లేదని స్పష్టం చేసేశారు. అయితే 'అతడు' సినిమాలో స్ఫూర్తి పొంది తీసిన సీన్స్ లాగానే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర తీరుతెన్నులు అచ్చంగా మధుబాబు నవలల్లో హీరో పాత్రని పోలి ఉంటాయని తెలుస్తోంది.
మరి గతంలో 'మీనా' నవలని సినిమాగా తెరకెక్కించి టైటిల్స్‌లో రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి పేరుని వేయని త్రివిక్రమ్.. తాను అభిమానించే మధుబాబు నవలల స్ఫూర్తితో ఆవిష్కరించే హీరో తీరు తెన్నుల విషయంలోనైనా ఆ క్రెడిట్‌ను మధుబాబుకు ఇస్తారో లేదో చూడాలి.