తెలంగాణలో జనసేన ప్రభావం ఉంటుందా..? 32 సీట్లలో డిపాజిట్లు దక్కేవి ఎన్ని ?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో మరో రెండు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ 32 నియోజకవర్గాల్లో పోటీ చేయబోయనున్నట్లు తెలంగాణ నేతలు ప్రకటించారు. ఓసారి ఈ నియోజకవర్గాలను పరిశీలిస్తే ఆంధ్ర మూలాలు గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని స్థానాలే ఎక్కువగా ఉన్నాయి. గ్రేటర్ హైదరబాద్‌లోని కూకట్పల్లి, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, పటాన్ చెరు, సనత్ నగర్, ఉప్పల్, మల్కాజ్ గిరి, మేడ్చల్ స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, వైరా, కొత్తగూడెం, అశ్వారావుపేట, మథిర, ఇల్లెందు, సత్తుపల్లి, పాలేరులో పోటీకి దిగనున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రభావంగా లేని జనసేన..
ఇక మిగిలిన నియోజకవర్గాలను చూస్తే వరంగల్ జిల్లాలోని పాలకుర్తి, నర్సంపేట, స్టేషన్ ఘన్ పూర్, వరంగల్ పశ్చిమ, తూర్పు నియోజకవర్గాలు ఉండగా.. నల్గొండ జిల్లాలోని నకిరేకల్, మునుగోడు, హుజూరాబాద్, కోదాడ స్థానాలు ఉన్నాయి. అలాగే కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, రామగుండం, జగిత్యాల, హుస్నాబాద్, మంథని, ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్, మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూలు నియోజకవర్గాల్లో జనసేన పోటీచేయబోతోంది. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా జనసేనకు తెలంగాణలో అసలు క్యాడరే లేదన్న మాట వాస్తవం. పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటివరకు తెలంగాణలో సరైన నాయకత్వం లేదు. సేనాని పవన్ కల్యాణ్ కూడా తెలంగాణ రాజకీయాలను అంత సీరియస్‌గా తీసుకోలేదు.
బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీల్చేందుకే పోటీ అనే ఆరోపణలు..
ఏపీ రాజకీయాలతోనే ఎప్పుడూ బిజీగా ఉండే పవన్.. తెలంగాణపై ఎక్కడా ఫోకస్ చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా సరైన నాయకులను నియమించుకోలేకపోయారు. ఏదో కొన్ని నియోజకవర్గాలకు మాత్రమే ఇంచార్జ్‌లను నియమించారు. వారు కూడా ఎప్పుడూ ప్రజల సమస్యలపై పోరాడలేదు. ఒక్కసారి కూడా ప్రభుత్వంపై వ్యతిరేకంగా తమ గళం విప్పలేదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా 32 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడం చూసి రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఓట్ల రూపంలో చీల్చడానికే జనసేన పోటీకి దిగుతుందని ఆరోపిస్తున్నారు.
ఏపీలోనే ఓడిపోయిన జనసేనకు.. ఇక్కడ డిపాజిట్లైనా వస్తాయా అనే ప్రశ్నలు
ఒక హీరోగా మాత్రమే పవన్ కల్యాణ్‌ను అభిమానించే అభిమానులు ఉన్నారు. అయితే వారంతా ఓటు వేస్తారనే నమ్మకం లేదు. ఎందుకంటే ఏపీలో 2019 ఎన్నికల్లో సాక్షాత్తూ అధినేత పవన్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనే ఆయనకు ఓటు వేసి గెలిపించలేకపోయారు అభిమానులు. అలాగే 100కు పైగా స్థానాల్లో పోటీ చేస్తే కేవలం ఒక్క చోట మాత్రమే జనసేన ఎమ్మెల్యే గెలిచారు. ఎన్నికలకు ముందు పవన్ పెట్టిన సభలకు జనం పోటెత్తారు కానీ ఓటు మాత్రం వేయలేదు. రాజకీయాలు వేరు.. సినిమాలు వేరు అని దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎంతో కొంత బలంగా ఉన్న ఏపీలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక ఏమాత్రం ఉనికి లేని తెలంగాణలో డిపాజిట్లు అయిన దక్కుతాయా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
టీడీపీపై ఒత్తిడి పెంచేందుకే 32 సీట్లలో పోటీకి నిర్ణయం..!
ఇక ఏపీలో టీడీపీతో అధికారికంగా పొత్తు పెట్టుకున్న జనసేన.. తెలంగాణలో మాత్రం పొత్తుపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో ప్రస్తుతానికి ఒంటరి పోరుకు సిద్ధమైంది. మరోవైపు బాలకృష్ణ కూడా తెలంగాణలో పొత్తుల అంశంపై చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని ప్రకటించారు. దీంతో ఎన్నికలకు ఎక్కువ సమయం లేనందున తెలంగాణలో రెండు పార్టీల మధ్య పొత్తు కష్టమనే చెప్పాలి. అయితే ఏ మాత్రం బలం లేని తెలంగాణలో 32 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం వెనక పవన్ వ్యూహత్మకంగా వ్యవహరించారనే వాదనలు కూడా వస్తున్నాయి. ఎందుకుంటే ఏపీలో ఇప్పుడు టీడీపీకి పవన్ అపన్నహస్తం అందిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ ముందు వరకు జనసేనకు 15-20 సీట్లు ఇవ్వాలనే ఆలోచన టీడీపీ ఉంది. ఇప్పుడు పరిస్థితులు తారుమారు కావడంతో ఆ అవకాశాన్ని వినియోగించుకుని కనీసం 40-50 సీట్లు తీసుకోవాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే తెలంగాణలో అన్ని స్థానాలకు అభ్యర్థులను నామమాత్రంగా పోటీలో పెట్టారని కూడా భావిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments