CM Jagan:విశాఖలోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తా.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..
Send us your feedback to audioarticles@vaarta.com
విశాఖ రాజధానిపై సీఎం జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామికవేత్తలతో వైజాగ్‌లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో నిర్వహించిన'విజన్ విశాఖ' సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచి విశాఖలోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని తెలిపారు. అలాగే ఇక్కడి నుంచే పాలన చేస్తానని.. అదే తన కమిట్‌మెంట్ అని పేర్కొన్నారు. అలాగే అమరావతికి తాను వ్యతిరేకం కాదని.. రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలంటే లక్ష కోట్ల రూపాయలు కావాలన్నారు. కానీ వైజాగ్ అయితే ఇప్పటికే బాగా అభివృద్ధి చెందిందని తక్కువ ఖర్చుతో డెవలెప్ చేయవచ్చని స్పష్టంచేశారు.
అందుకే లేజిస్లేటివ్ క్యాపిటల్‌గా అమరావతి కొనసాగిస్తామని వివరించారు. సీఎం వైజాగ్ నుంచి పాలిస్తామంటే కొంతమంది నాయకులు కోర్టుల్లో కేసులు వేస్తూ అడ్డుపడుతున్నారని విమర్శించారు. అమరావతి రాజధాని అవుతుందని ముందే తెలిసి వేల ఎకరాలు భూములు కొన్నారని ఆరోపించారు. విశాఖ రాజధాని అయితే అక్కడ వారి భూముల రేట్లు పడిపోతాయని కుట్రలకు తెరలేపారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వైజాగ్ నుంచి పాలన చేయడం ఖాయమన్నారు. వచ్చే పదేళ్లలో విశాఖను ప్రపంచస్థాయి రాజధానిగా నిర్మిస్తామని జగన్ వెల్లడించారు.
దేశంలోని మిగతా నగరాలతో పోల్చుకుంటే వైజాగ్ చాలా త్వరగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. రాష్ట్రానికి విశాఖ చాలా ముఖ్యమైన బ్యాక్ బోన్‌గా ఉండబోతోందని అన్నారు.
భవిష్యత్‌లో హైదరాబాద్ కంటే వైజాగ్ అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. విభజనలో భాగంగా హైదరాబాద్ కోల్పోయామని దాని ప్రభావం నేటికీ ఉంటోందన్నారు. ఓవైపు అభివృద్ధిని కొనసాగిస్తూనే ముఖ్యమైన వ్యవసాయ రంగాన్ని కూడా ఉరకలు పెట్టిస్తున్నామన్నారు. ప్రస్తుతం వ్యవసాయం ఏపీలో 70 శాతం వృద్ధిని నమోదు చేసిందన్నారు. రాష్ట్రంలో స్థిరత్వమైన ప్రభుత్వం ఉందని అభివృద్ధితో కూడిన సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు.
చాలా రంగాల్లో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ మెరుగైన స్థానంలో ఉందన్నారు. విశాఖను ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్‌లా మారుస్తామని.. విశాఖ ఇంకా చాలా అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. ఈ నగరాన్ని అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేస్తామని సీఎం జగన్ తెలిపారు. బెంగళూరు కంటే వైజాగ్‌లో మెరుగైన సదుపాయాలు ఉన్నాయని.. సముద్ర తీరంలో పోర్టులను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఇందులో రామాయపట్నం, కాకినాడ, మూలపేట, మచిలీపట్నం పోర్టులు కీలకమని తెలియజేశారు. ఈ సందర్భంగా వైజాగ్‌లో నిర్మించబోతున్న సచివాలయం నమూనాను ఆయన విడుదల చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com