‘సాహో’ టికెట్ ధర పెరగనుందా?
- IndiaGlitz, [Monday,August 26 2019]
స్టార్ హీరోల సినిమాలు విడుదలైతే సామాన్యంగా టికెట్ ధరలకు రెక్కలొస్తాయి. ఫ్యాన్స్ షో సమయంలో ఈ టికెట్ ధరలు రెండు, మూడువేలరూపాయలవుతాయి. ఇక సామాన్య టికెట్స్ ధరలకు బ్లాక్‌లో రెక్కలొస్తాయి. కానీ కౌంటర్లో టికెట్ ధరలు నార్మల్‌గానే ఉంటాయి. అయితే ప్రస్తుతం ట్రెండ్ మారింది. భారీ బడ్జెట్ చిత్రాలు రూపొందుతున్నాయి. మరో పక్క సినిమా లైఫ్ టైమ్ తగ్గింది. తొలివారంలోనే సినిమా వసూళ్లను రాబట్టుకోవాలి. లేకపోతే.. మరుసటి వారానికి సినిమాల రిలీజ్ ప్రవాహంలో కొట్టుకుపోవాల్సిందే. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ సినిమాలపై పెట్టిన బడ్జెట్‌ను రాబట్టుకోవడానికి టికెట్స్ ధరను పెంచుకుంటున్నారు. తాజాగా విడుదల కాబోతున్న ‘సాహో’ సినిమా విషయంలోనూ అదే జరగనుంది.
వినపడుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో డిస్ట్రిబ్యూటర్స్ ప్రభుత్వ పెద్దల అనుమతితో టికెట్ ధరను రూ.200గా నిర్ణయించారట. తొలి మూడు రోజులు టికెట్ ఈ ధరకే వస్తుందట. సింగిల్ స్క్రీన్ అయినా రేటు మారదనేది టాక్. ఇప్పుడు తెలంగాణలో కూడా టికెట్ దరను పెంచాలని డిస్టిబ్యూటర్స్ నిర్ణయించుకున్నారట. ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వంలో చర్చలు జరిపే ప్రయత్నాలు చేస్తున్నారనేది టాక్.
ప్రభాస్, శ్రద్ధాకపూర్ హీరో హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి సుజిత్ దర్శకుడు. ఆగస్ట్ 30న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ‘సాహో’ ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. మందిరాబేడి, జాకీష్రాఫ్, చుంకీ పాండే, అరుణ్ విజయ్, నీల్ నితిన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. ఈ సినిమా రూ.335 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్‌ను జరుపుకుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తోన్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా విడుదల తర్వాత ‘సాహో’ ఎన్ని రికార్డులకు తెర తీస్తుందో వేచి చూడాలి.