కాంగ్రెస్ ఖాళీ.. బీజేపీలోకి రేవంత్, కోమటిరెడ్డి!?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోయినట్లేనా..? ఉన్న అరకొర ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పార్టీని వీడి మరో జాతీయ పార్టీ గూటికి చేరాలని ప్రయత్నాలు చేస్తున్నారా..? అన్నీ అనుకున్నట్లు జరిగితే ఉద్దండులుగా పేరుగాంచిన ఆ ఇద్దరు ఎంపీలు బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇది అక్షరాలా నిజమనిపిస్తోంది. ఇంతకీ వీళ్లు ఎందుకు కమలం గూటికి చేరాలనుకుంటున్నారు..? కాంగ్రెస్ పార్టీ నచ్చలేదా..? లేకుంటే నాయకత్వం నచ్చలేదా..? తెలంగాణలోనే కాదు దేశంలోనే ఇక పార్టీ లేదని వెళ్లిపోతున్నారా..? అనేది ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
బీజేపీ టార్గెట్ ఇదీ..!
2014 ఎన్నికలతో పోలిస్తే.. తాజాగా దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి రాష్ట్రాల్లో మరీ ఘోరంగా తయారైంది. ఇది చేజేతులారా చేసుకున్నదా..? లేకుంటే సరియయైన నేతలు లేకపోవడమా..? అన్నది ఇక్కడ అనవసరం. అయితే కొన్ని రాష్ట్రాల పేరెత్తితో అక్కడ కాంగ్రెస్ అనే మాట తప్ప కమలం అనే పదాలు ఎక్కడా కనపడేవి.. వినబడేవి కాదు.. ఈ ఎన్నికల్లో మాత్రం సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఏ రాష్ట్రంలో అయితే కమలం పార్టీకి ఉనిఖి లేదో అక్కడ దూసుకెళ్తోంది. ఇందుకు చక్కటి ఉదాహరణ తెలంగాణ రాష్ట్రమే. ఇక్కడ బీజేపీ కార్యకర్తలు బహుశా కొదువ లేకపోవచ్చేమోగానీ.. ఎన్నికల్లో గెలిచే నేతలు కరువనే చెప్పుకోవాలి.. అలాంటి ఎంపీ ఎన్నికల్లో ఏకంగా సీఎం కేసీఆర్ కుమార్తెను ఓడించడమంటే ఆషామాషీ విషయమేం కాదు.. అలా ఒకట్రెండు కాదు ఏకంగా 4 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో ఇంకాస్త గట్టిగా అనుకుని ప్రయత్నాలు చేస్తే 2023 కల్లా రాష్ట్రంలో కనీసం సగం కంటే ఎక్కువ పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవాలనే వ్యూహంతో బీజేపీ అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కమలనాథుల్లో ఉద్ధండులైన నేతలు రంగంలోకి దిగి అసంతృప్త నేతలు, తరాలు తరాలుగా రాజకీయాల్లో పేరుగాంచిన నేతలకు కమలం కండువా కప్పాలని బీజేపీ పెద్దలు యోచిస్తున్నారు.
జంప్ అయ్యేదెవరో..!
ఇందులో భాగంగా.. తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎంపీలు బీజేపీలో చేరేందుకు సిద్ధపడుతున్నారని.. బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్‌తో మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారని జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరితోపాటు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, మాజీ ఎంపీ వివేక్, కేసీఆర్ అన్న కుమార్తె కల్వకుంట్ల రమ్యారావు బీజేపీ ప్రధాన కార్యదర్శితో రామ్ మాధవ్‌తో ఢిల్లీ వేదికగా రహస్య చర్చలు జరిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఏపీకి చెందిన నేతలు కూడా!
ఇదిలా ఉంటే భేటీ అయిన నేతలతో కాకుండా పలువురు తెలుగు రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు, రాజకీయ ఉద్ధండులు రామ్ మాధవ్‌తో టచ్‌లో ఉన్నారని తెలుస్తోంది. వీరిలో టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి రేగులపాటి రమ్యారావు, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగుదేశం పార్టీ కీలక నేతలు రాంమాధవ్‌తో టచ్‌లో ఉన్నట్లు తెలియవచ్చింది. కాగా.. గత కొన్ని రోజులు టీడీపీ ఎంపీ కేశినేని నాని, జేసీ బ్రదర్స్, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, అనంతపురం, కడప జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
అబ్బే అదేం లేదే..!
అయితే పైన చెప్పినట్లుగా రామ్ మాధవ్‌తో భేటీ అయినట్లు వచ్చిన వార్తలపై స్పందిస్తూ.. ‘అబ్బే.. మేం ఎందుకు వెళ్తున్నాం.. మాకు ఆ అవసరమేంటి’ అని తగిలీ తగలకు మాత్రమే ఖండిస్తుండటం గమనార్హం. తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలు కనిపించకపోవడంతోనే వారు బీజేపీ వైపు చూస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. ముందస్తు ఎన్నికల్లో అంతంత మాత్రమే స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్.. ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలు కారెక్కగా.. మిగిలిన వారు కూడా క్యూలోనే ఉన్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో ముచ్చటగా ముగ్గురు గెలవగా ఇద్దరు బీజేపీకి టచ్‌లో ఉన్నారంటే తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇదీ అసలు సమస్య..!
వాస్తవానికి తెలంగాణలో కాంగ్రెస్ నేతల్లో నాయకత్వం అనేది లోపించింది అనేది బహిరంగంగా తెలిసిన విషయమే. ఎంతసేపూ నాకు ఫలానా పదవి కావాలి..? ఆ పదవి నాకే ఇచ్చితీరాలి..? నాకు ఆ పదవి దక్కితే పరిస్థితి ఎలా ఉంటుందో చూపిస్తాం అనే నేతలే ఎక్కువున్నారు తప్ప కలిసి కట్టుగా ముందుకెళ్లి పార్టీని బలోపేతం చేద్దామనే నేతలు అతి తక్కువే.. దీంతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈ స్థితికి వచ్చింది. సో.. ఇకనైనా నేతలు నిద్రలేస్తే సరే లేకుంటే ఆంధ్రప్రదేశ్‌లో జరిగినట్లుగానే తెలంగాణలోనూ జరిగిన ఆశ్చర్యపోనక్కర్లేదేమో.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com