పవన్ కల్యాణ్ పోటీ చేసేది ఇక్కడ్నుంచేనా..!?
Send us your feedback to audioarticles@vaarta.com
జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేస్తానని ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. జనసేన పోటీ చేస్తుంది సరే.. అసలు పవన్ పోటీ చేస్తారా..? చేయరా..? ఒక వేళ ఆయన పోటీ చేస్తే ఎక్కడ్నుంచి పోటీ చేస్తారు..? రాయలసీమ నుంచి పోటీ చేస్తారా? లేకుంటే సీమాంధ్రలోని పాలకొల్లు నుంచి పోటీ చేస్తారా..? అనే ప్రశ్నలకు మాత్రం సమాధానాలు రావట్లేదు. దీంతో పవన్ ఎప్పుడెప్పుడు ప్రకటన చేస్తారా అని అటు అభిమానులు, ఇటు జనసైనికులు వేయికళ్లతో వేచి చూస్తున్నారు. పవన్ ఇప్పటికే మూడు నియోజకవర్గాలు ఫిక్స్ చేసుకున్నారని ఆ మూడింటిలో ఎక్కడ్నుంచి పోటీ చేస్తే పరిస్థితులు అనుకూలిస్తాయని సర్వే చేసే పనిలో ఓ ప్రత్యేక బృందం నిమగ్నమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
పాలకొల్లు, తిరుపతి విషయానికొస్తే...
అనంతపురం సిటీ, తిరుపతి సిటీ, పాలకొల్లు ఈ మూడు నియోజకవర్గాలు సెలెక్ట్ చేసుకున్నారట. అయితే సర్వే పూర్తవ్వగానే ఆయా నియోజకర్గ జనసైనికులు, పార్టీ ముఖ్యనేతలతో కలిసి పవన్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూడు నియోజకర్గాల్లో రెండు చోట్ల ఇదివరకే ‘ప్రజారాజ్యం’ పార్టీ తరఫున చిరంజీవి పోటీ చేశారు. 2009 ఎన్నికల్లో తిరుపతి, పాలకొల్లు రెండు చోట్లా అసెంబ్లీ నుంచే చిరు పోటీ చేశారు. పాలకొల్లులో ఘోరంగా ఓటమిని చవిచూడగా.. తిరుపతిలో 15,930 ఓట్ల మెజార్టీతో చిరంజీవి గెలిచారు. అందుకే అన్న సెంటిమెంట్‌తో పవన్ కూడా తిరుపతి లేదా పాలకొల్లు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ తిరుపతి కాదనుకుంటే అనంతపురం వైపు వెళ్లే యోచనలో ఉన్నారట. ఇదిలా ఉంటే పవన్ తిరుపతి నుంచి బరిలోకి దిగితే ఆయనపై సినీ క్రిటిక్ కత్తి మహేశ్ పోటీ చేయాలని భావిస్తున్నట్ల సమాచారం. ఏదైనా పార్టీ టికెట్ ఇస్తే సరే లేకుంటే బీఎస్పీ తరఫున పోటీ చేయాలని భావిస్తున్నారాయన.
అనంతపురం విషయానికొస్తే...
అనంతపురం జిల్లా ఎప్పట్నుంచో పరిటాల, జేసీ బ్రదర్స్ చేతుల్లో ఉంది. టీడీపీ హయాంలో పరిటాల ఫ్యామిలీ.. కాంగ్రెస్ హయాంలో జేసీ బ్రదర్స్.. అయితే ఇప్పుడు ఇద్దరూ ఒకే పార్టీలో ఉంటూ జిల్లాలో తెలుగుదేశంను మరింత బలోపేతం చేస్తున్నారు. అనంత సిటీ విషయానికొస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి.. సీఎం చంద్రబాబుకు ఆప్తుడిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈయనకు దాదాపు టికెట్ ఖరారైనట్లే.! పవన్ ఇక్కడ్నుంచే పోటీ చేస్తే పరిస్థితేంటి..? నియోజకవర్గంలో ఒక్క సామాజిక వర్గమే గెలుపును నిర్ణయిస్తుంది. పైగా చౌదరి బాగా ఇక్కడ పట్టున్న నేత. గతంలో 9,334 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన ఈయన మరోసారి పసుపుజెండా ఎగరేసి మంత్రి పదవి దక్కించుకోవాలని సన్నాహాలు చేస్తున్నారు. అందుకే జిల్లాలో ఎక్కడా లేనంతగా నిధులు తేవడం.. నిత్యం జనం మధ్యే గడుపుతూ వస్తున్నారు. ఇక్కడ్నుంచి పవన్ పోటీచేస్తే పవన్‌కు గెలిచే అవకాశాలు లేవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే ఈ మూడు నియోజకవర్గాల్లో పవన్ ఎక్కడ్నుంచి పోటీ చేస్తారో..? ఆయన చేపించే సర్వేలో ఏం తేలుతుందో..? తెలియాలంటే జనసేన తొలిజాబితా వచ్చే వరకు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments