పవన్ కల్యాణ్ ‘కింగ్ మేకర్’ అవుతారా..!?
- IndiaGlitz, [Friday,January 25 2019]
2019 ఎన్నికల్లో మళ్లీ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని ధీమాతో నారా చంద్రబాబు ఉండగా.. 2014 ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలడంతో ఎలాగైనా సరే ఈ సారి సీఎం పీఠం తనదేనని వైఎస్ జగన్.. మీరిద్దరూ కాదు నేనే ‘కింగ్ మేకర్’ అవుతానని.. జనసేనాని ధీమాతో ఉన్నారు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మాత్రం ఎవరితో కలిసి ముందుకెళ్లాలా అని ఆలోచనలో పడ్డాయి. ఇలా ఎవరు ధీమాలో వారున్నారు. అయితే బాబు, జగన్‌ల కంటే ఎక్కువగా పవన్ కల్యాణ్ గురించే ఏపీ జనాలు ఎక్కువగా చర్చించుకుంటున్నారు.
అధికార, ప్రతిపక్షాలకు సవాల్‌గా పవన్!
ఏపీలో ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీ మధ్యే ఉంటుందని.. మిగతా ఏ పార్టీలకు పెద్దగా లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే తనను తక్కువ అంచనా వేస్తున్నారు.. ఆ పార్టీలకంటే తనకే ఎక్కువ జనసైన్యం ఉందని.. మీరందరూ సపోర్ట్ చేస్తే కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని చెబుతూ పవన్ జనాల్లోకి వెళ్తున్నారు. అంతేకాదు గత నాలుగు నెలలుగా చూస్తున్న పరిణామాలు చూస్తుంటే.. ఏపీలో ఏ ఒక్క పార్టీకి సంపూర్ణమైన మెజార్టీ రాని పక్షంలో జనసేన గెలవబోయే స్థానాలే కీలకంగా మారే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.
కోస్తాపైనే జనసేనాని కన్ను..!
పవన్ కల్యాణ్ మొదట్నుంచి కోస్తా జిల్లాలపై గట్టిపట్టు సాధించాలని దాదాపు కొన్ని నెలలపాటు అక్కడే పర్యటన చేశారు. భారీ బహిరంగ సభలు, కవాతులు అంటూ అభిమానులు, కార్యకర్తలు, సామాజికవర్గానికి మరింత దగ్గరయ్యారు. అందుకే ఉత్తర కోస్తా జిల్లాల్లోనే జనసేన ప్రభావం ఎక్కువగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే రాయలసీమతో పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో జనసేన ప్రభావం అస్సలే ఉండదని కూడా తేల్చేశారు. ఇందుకు కారణాలు లేకపోలేదు.. రాయలసీమలో ఒకే ఒక్క అనంతపురం జిల్లాలో తప్ప కడప, చిత్తూరు, కర్నూలు ప్రాంతాల్లో పవన్ పర్యటించకపోవడమే.
సీట్ల సంగతేంటి..!?
జనసేన గురించి ఎంత మంది ఎన్ని అనుకున్నా తనకేం ఇబ్బంది లేదు.. తానెవ్వరితో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని కచ్చితంగా ఒంటరిపోరు చేస్తానని పవన్ చెబుతున్నారు. అయితే ఒంటరిగా పోటీ చేస్తున్న పవన్‌కు ఏ మాత్రం సీట్లు వస్తాయన్నది మాత్రం అంతుచిక్కట్లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ‘పవన్‌కు ఎన్ని సీట్లు రావొచ్చు’ పోల్‌కు మాత్రం పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. పవన్ ఒక్కరు గెలిస్తే పెద్ద గండమేనని కొందరు.. కచ్చితంగా ఉభయ గోదావరి జిల్లాలో 10 సీట్లు వరకు వస్తాయని మరికొందరు నెటిజన్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో పవన్‌కు ఊహించని రీతిలో సీట్లు వస్తాయని జనసైన్యం చెబుతోంది.
కింగ్ మేకర్ ఖాయమేనా..!
గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలో ఎక్కువ సీట్లు గెలిచి జనసేనాని కింగ్ మేకర్ స్థానంలో నిలవడం ఖాయమని పవన్ అభిమానులు, కార్యకర్తలు గట్టి నమ్మంతో ఉన్నారు. మరీ ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలైన టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ ఎవరితోనూ పొత్తు పెట్టకోకుండా ఒంటరిగా పోటీ చేస్తే మాత్రం ఆ పోటీలో జనసేన లాభపడే అవకాశం ఉందనే మాట రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఒకరికొకరు పొత్తు పెట్టుకోకుండా ఎవరికి వారుగా పోటీ చేస్తే మాత్రం కచ్చితంగా ప‘వన్’ కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.
అయితే పాదయాత్ర కచ్చితంగా ప్లస్ అవుతుందని వైఎస్ జగన్ భావిస్తుండగా... తాము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరీ ముఖ్యంగా ఏపీలో మరోసారి టీడీపీ గెలవడం చారిత్రాత్మక అవసరమే నినాదాన్ని చంద్రబాబు అండ్ కో జనాల్లోకి గట్టిగా తీసుకెళ్తున్నారు. దీంతో తాను మరోసారి సీఎం అవుతానని చంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారం ఎవరి సొంతమవుతుంది..? కింగ్ మేకర్ అయ్యేది ఎవరనే విషయం తెలియాలంటే ఫలితాలొచ్చే వరకు వేచి చూడాల్సిందే.