జగన్ ప్రమాణ స్వీకారానికి నేను వెళ్లను..!
- IndiaGlitz, [Wednesday,May 29 2019]
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కనివీనీ ఎరుగని రీతిలో భారీ మెజార్టీతో గెలిచి వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. రేపు అనగా మే-30న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ‘జగన్ అనే నేను..’ నవ్యాంధ్ర రెండో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, డీఎంకే అధినేత స్టాలిన్‌తో పాటు పలు పార్టీల అధినేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వైఎస్ జగన్ ఆహ్వానం పంపారు. కొందరిని జగనే స్వయంగా వెళ్లి ఆహ్వానించగా మరికొందరికి తమ పార్టీ నేతలచేత ఆహ్వానాలు పంపారు.
సుధీర్ఘంగా చర్చించి..!
ఈ క్రమంలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ స్వయంగా ఫోన్ చేసి ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. జగన్ ఫోన్ కాల్‌ను సాదరంగా స్వీకరించిన చంద్రబాబు మర్యాదపూర్వకంగానే మాట్లాడుకున్నారు. అయితే రేపు ప్రమాణ స్వీకారోత్సవం జరగనుండటంతో అసలు వెళ్లాలా..? వద్దా..? వెళ్తే పరిస్థితేంటి..? నామోషిగా ఉంటుందా..? లేకుంటే పార్టీ తరఫున ఇద్దరు నేతలను పంపాలా..? అని బుధవారం రోజు నిశితంగా చర్చించారు. ఈ భేటీలో టీడీపీ నేతలు చంద్రబాబును టీడీపీఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకాకూడదని నిర్ణయించుకున్నారు.
ప్రమాణఆనికి ఆ ఇద్దరే..!
సుధీర్ఘంగా చర్చించిన అనంతరం తనకు బదులుగా ఇద్దరు టీడీపీ సీనియర్ నేతలతో కూడిన ప్రతినిధి బృందాన్ని పంపాలని చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఈ ఇద్దరు నేతలు రేపు ఉదయం తాడేపల్లిలోని జగన్ ఇంటికి వెళ్లి అభినందిస్తారని విశ్వసనీయవర్గాల సమాచారం. అనంతరం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరవుతారు. అయితే ఆ ఇద్దరు నేతలు ఎవరన్నది మాత్రం తెలియరాలేదు. బహుశా మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇద్దరూ వెళ్లొచ్చని తెలుస్తోంది. సో.. ఆ ఇద్దరు ఎవరో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే మరి.