కోవిడ్‌తో క్వారంటైన్‌లో మహేశ్.. అన్నయ్య అంత్యక్రియలకు హాజరవుతారా..?

  • IndiaGlitz, [Sunday,January 09 2022]

జీవితంలో మన కష్టసుఖాల్లో తోడుండి.. అన్నింట్లో ఆసరాగా నిలిచిన ఆత్మీయుల మరణం ఏ మనిషికైనా తీరని లోటే. కొద్దిసేపటి వరకు మనతో నవ్వుతూ మాట్లాడిన వ్యక్తి మరుక్షణంలో కన్నుమూస్తే ఆ బాధ వర్ణనాతీతం. ఇదే గుండెకోత అనుకుంటే.. వారి అంత్యక్రియలకు హాజరుకాలేకపోతే ఆ వ్యక్తి గుండె బద్ధలే. అచ్చం ఇలాంటి పరిస్థితుల్లోనే వున్నారు టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు. ఆయన అన్నయ్య , నటుడు రమేశ్ బాబు అనారోగ్యంతో కన్నుమూశారు.

గతకొద్దిరోజులుగా కాలేయ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న రమేశ్ బాబు ఆరోగ్యం శనివారం ఒక్కసారిగా క్షీణించడంతో ఆయనను కుటుంబసభ్యులు హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రమేశ్ బాబు మరణించినట్లు డాక్టర్లు ప్రకటించడంతో సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం విషాదంలో కూరుకుపోయింది. అన్నయ్య మరణంతో మహేశ్ బాబు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయనతో ప్రిన్స్‌కి అనుబంధం ఎక్కువ.

రమేశ్ బాబు సినిమాలలో బాలనటుడిగానూ ఆయన నటించారు. నటనకు దూరమైనప్పటికీ.. తమ్ముడు మహేశ్‌తో కలిసి రమేశ్ బాబు సినిమాలు నిర్మించారు. అలాంటి అన్నయ్య మరణం మహేశ్‌కు తీరని లోటే. అయితే ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏంటంటే.. రమేశ్ బాబు అంత్యక్రియలకు మహేశ్ హాజరవుతారా లేదా అన్నదే డౌట్. ఇటీవల మహేశ్ కోవిడ్ బారినపడ్డారు. స్వల్ప లక్షణాలే అయినప్పటికీ ఆయన హోం క్వారంటైన్‌లో వుంటూ చికిత్స తీసుకుంటున్నారు. కరోనా మార్గదర్శకాల ప్రకారం మహేశ్ బాబు బయటకు రావడానికి వీల్లేదు. దీంతో అన్నను కడసారి చూసుకునేందుకు కూడా ఆయన నోచుకుంటారా, అంత్యక్రియలకు హాజరవుతారా లేదా అన్నది అనుమానమే.