Producer Nattikumar:త్వరలోనే టీడీపీలో చేరతా: నిర్మాత నట్టికుమార్
- IndiaGlitz, [Saturday,December 30 2023]
తాను త్వరలోనే చంద్రబాబును కలిసి టీడీపీలో చేరనున్నట్లు సినీ నిర్మాత నట్టికుమార్ తెలిపారు. చోడవరంలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పాలనలో అంతా రెడ్డి కులమే రాజ్యమేలుతుందని ఆరోపించారు. తొలుత తాను వైసీపీ సానుభూతిపరుడినేనని అయితే వైసీపీ అధినేత జగన్ తీసుకున్న నిర్ణయాలతో విసిగిపోయానని తెలిపారు. గత ఎన్నికల్లో తమలాంటి వాళ్లను వైసీపీ తన స్వార్థానికి ఉపయోగించుకుందని మండిపడ్డారు.
ఉత్తరాంధ్రను మోసం చేసేందుకే జగన్ రాజధాని పేరుతో నాటకమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఎంపీ సత్యనారాయణ రూ.2వేల కోట్ల విలువైన చర్చి ఆస్తులను ఆక్రమించుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే విశాఖకు కోట్లాది రూపాయల విలువైన పరిశ్రమలు వచ్చినట్టు మంత్రి అమర్‌నాథ్ చెబుతున్నారని.. ఎక్కడ, ఎన్ని పరిశ్రమలు వచ్చాయో చూపించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఆలోచనకు ప్రజా బలం ఉన్న పవన్ కల్యాణ్ కూడా తోడు కావడంతో జగన్‌కు దిమ్మతిరింగదని ఎద్దేవా చేశారు. అందుకే ఏం చేయాలో తెలియక దండయాత్రలు చేయిస్తున్నారని నట్టి కుమార్ విమర్శించారు.
అలాగే రాంగోపాల్ వర్మ ఓ డైరెక్టర్ మాత్రమేనని వైసీపీ వాళ్లు ఇచ్చే డబ్బులతో వ్యూహం సినిమా తీశాడని చెప్పారు. డబ్బులిచ్చారు కాబట్టి ఆర్జీవీకి వైసీపీపై సానుభూతి ఉంటుందన్నారు. కానీ సినిమాలు చూసి ప్రజలు ఓట్లు వేసే రోజులు ఎప్పుడో పోయాయన్నారు. తాను కూడా త్వరలోనే వైసీపీకి వ్యతిరేకంగా ఓ సినిమా తీస్తానన్నారు. ఇందులో బాబాయ్ వివేకానందరెడ్డ మర్డర్, ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై చిత్ర హింసలు, వైసీపీ అరాచకాలు వంటివి చూపిస్తానని స్పష్టంచేశారు. సినీ ఇండస్ట్రీ మొత్తం టీడీపీ వైపు ఉందని.. కాకపోతే ప్రస్తుతం భయంతో ఉన్నారని.. త్వరలో అందరూ టీడీపీకి మద్దతుగా వస్తారని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేనకి 130 నుంచి 150 సీట్లు వస్తాయని, వైసీపీ 29సీట్లకు పరిమితం అవుతుందని ఆయన జోస్యం చెప్పారు. కాగా గతంలో స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో తెలుగు ఇండస్ట్రీ నుంచి తొలుత నట్టికుమార్ మాత్రమే స్పందించిన సంగతి తెలిసిందే.