నాగార్జున కెరీర్‌లో మ‌రో స్పెష‌ల్ మూవీ అవుతుందా?

  • IndiaGlitz, [Thursday,March 01 2018]

నాగార్జున కెరీర్‌లో ప్ర‌త్యేకంగా నిలిచిన చిత్రాలలో అన్న‌మ‌య్య‌, మ‌నం త‌ప్ప‌కుండా ఉంటాయి. ఈ రెండు చిత్రాల‌కి ఓ ప్ర‌త్యేకత ఉంది. అదేమిటంటే.. ఆయా సినిమాలు మే నెలాఖ‌రులో విడుద‌ల‌వ‌డం. నాగ్ కెరీర్‌లో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన చిత్రంగా నిలిచిన అన్న‌మ‌య్య.. 1997 మే 22న విడుద‌లైంది. ఇక నాగ్‌కు మెమ‌ర‌బుల్ మూవీ అయిన మ‌నం విష‌యానికొస్తే.. 2014 మే 23న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

అక్కినేని వారి మూడు త‌రాల న‌టుల‌తో తెర‌కెక్కిన ఈ సినిమా నాగ్‌కు న‌టుడిగా మ‌రింత గుర్తింపు తీసుకువ‌చ్చింది. క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఇదే మే నెలాఖ‌రులో మ‌రో చిత్రం విడుద‌ల‌కి సిద్ధ‌మవుతోంది. అదే ఆఫీస‌ర్. తెలుగు సినిమాల ప‌రంగా ట్రెండ్ సెట్టింగ్ మూవీగా నిలిచిన శివకి ద‌ర్శ‌కుడు అయిన రామ్ గోపాల్ వ‌ర్మ‌తో నాగ్ చేస్తున్న ఐదో చిత్ర‌మిది.

ఇప్ప‌టివ‌ర‌కు ఏ చిత్రంలో క‌నిపించ‌ని విధంగా.. ఓ డిఫ‌రెంట్ లుక్‌తో ఇందులో క‌నిపించ‌నున్నారు నాగ్‌. హాలీవుడ్ చిత్రం టేకెన్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమాని రూపొందిస్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్న‌ప్ప‌టికీ.. వ‌ర్మ శైలిలో సాగే ఈ చిత్రం నాగ్ కెరీర్‌లో మ‌రొక ప్ర‌త్యేక చిత్రంగా నిలుస్తుంద‌ని చిత్ర వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, మే 25న ఈ సినిమా విడుద‌ల కానుంది.