ఏపీలో భారీగా పెరిగిన పోలింగ్.. ఆ పార్టీకే ప్లస్ కానుందా..?

  • IndiaGlitz, [Thursday,May 16 2024]

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భారీ స్థాయిలో ఓటింగ్ శాతం నమోదుకావడం విశేషం. గత ఎన్నికలతో పాటు ఇప్పటి వరకు నాలుగు దశల పోలింగ్‌తో పోల్చుకుంటే ఇదే అత్యధిక పోలింగ్. మరో విశేషం ఏంటంటే 15 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 80శాతానికి పైగా పోలింగ్ నమోదు అయింది. ఇందులో నాలుగు నియోజకవర్గాల్లో 85 శాతానికిపైగా ఓటింగ్‌ పోల్ అయింది. రాష్ట్రంలో మొత్తం 4 కోట్ల 13 లక్షల 33వేల 702 మంది ఓటర్లు ఉంటే... 3 కోట్ల 33లక్షల 40 వేల మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. వీరిలో మహిళలు కోటీ 69లక్షల 8వేల 684 మంది ఓటు వేశారు.

ఈ ఎన్నికల్లో పోలింగ్ స్టేషన్‌కు వచ్చి ఓటు వేసిన వారి శాతం 80.66 శాతంగా ఉంది. ఇది కాకుండా పోలింగ్ విధులకు హాజరయ్యే సిబ్బంది వేసిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు దీనికి అదనంగా ఉన్నాయి. ఇది 1.20 శాతంగా ఉంది. దీంతో మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో 81.86 శాతం పోలింగ్ నమోదైంది. ఇది 2019 ఎన్నికల్లో కంటే 2 శాతం ఎక్కువ కావడం గమనార్హం. 2019 ఎన్నికల్లో 79.80శాతం నమోదుఅయింది. దీంతో పెరిగిన 2శాతం పోలింగ్ ఏ పార్టీకి మద్దతుగా పడిందో తేలాల్సి ఉంది. గతంలో కంటే ఈసారి మాత్రం పోలింగ్‌కు ఓటర్లు ఉప్పెనలా కదిలి వచ్చారు. ఇతర రాష్ట్రాల్లో ఉండే ఓటర్లు కూడా తండోపతండాలుగా తరలివచ్చారు.

దీంతో ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద కిలోమీటర్ల మేర క్యూలైన్లు ఏర్పడ్డాయి. గంటగంటలకు పోలింగ్ పెరుగుతూనే ఉంది. సాయంత్రం 4 గంటల నుంచి ఒక్కసారిగా పోలింగ్ శాతం పెరిగిపోయింది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ సమయం ముగిసినా వేల మంది క్యూలైన్లలో నిల్చునున్నారు. దీంతో వారంతా ఓటు వేసి వెనుదిరిగారు. కొన్నిచోట్ల అర్థరాత్రి 2 గంటల వరకు పోలింగ్ జరిగింది. మొత్తం పోలింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేసరికి మంగళవారం సాయంత్రం అయింది. ఈసారి పార్లమెంట్‌కు ఓటు వేసే వారితో పోల్చుకుంటే అసెంబ్లీ అభ్యర్థులకు ఓటు వేసే వారి సంఖ్య 200 మంది ఎక్కువ ఉన్నారు.

పోలింగ్ శాతం అసెంబ్లీ సెగ్మెంట్‌లో చూసుకుంటే దర్శిలో ఎక్కువ శాతం నమోదైంది. ఇక్కడ 90.91 శాతం ఓటింగ్ పోల్ అయింది. పార్లమెంట్‌ స్థానం విషయంలో అత్యధికంగా ఒంగోలు 87.6శాతంతో టాప్ ప్లేస్‌లో ఉంది. ఇక కడప అసెంబ్లీ సెగ్మెంట్‌ 63.32 శాతంతో అతి తక్కువ పోలింగ్ శాతం నమోదు చేసుకుంది. పార్లమెంట్ సెగ్మెంట్‌ విషయానికి వస్తే 69.9 శాతంతో విశాఖ ఆఖరి స్థానంలో ఉంది. అయితే 2019 ఎన్నికలతో పోల్చుకుంటే ఇక్కడ కూడా పోలింగ్ శాతం పెరిగింది. మొత్తంగా భారీగా పెరిగిన పోలింగ్ శాతం ఏ పార్టీకి ఘన విజయాన్ని అందిస్తుందో తెలియాలంటే జూన్ 4వరకు ఆగాల్సిందే.