ఎంపీ జేసీపై వైసీపీ నుంచి పోటీచేసేది ఈయనేనా!?
- IndiaGlitz, [Sunday,January 27 2019]
ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. అనంతపురం జిల్లాలో ఆయనకు ఎంత మంచి పేరుందో అంతకు డబుల్ చెడ్డపేరు కూడా ఉందని నియోజకవర్గంలో జనాలు చెప్పుకుంటూ ఉంటారు.! అందుకే ఆయనకు ‘కాంట్రర్సీ కింగ్’ అనే బిరుదు కూడా ఇచ్చారు నెటిజన్లు. ఆర్థిక, అంగ బలంలో జేసీ బ్రదర్స్‌ను మించినోళ్లు జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా లేరన్నది జగమెరిగిన సత్యమే. జేసీ బ్రదర్స్‌ను ఎలాగైనా సరే ఢీ కొట్టి ఓడించాలని వైసీపీ వ్యూహరచన చేస్తోంది. ఈ క్రమంలో ఏ చిన్న అవకాశం వచ్చినా వదలకుండా సువర్ణావకాశంగా మలుచుకుంటూ ముందుకెళ్తోంది. ఇలాంటి తరుణంలో ఒకప్పుడు ఎంపీ జేసీపై మీసం మేలేసిన సీఐ గోరంట్ల మాధవ్‌ను వైసీపీ అధినేత జగన్ ఆహ్వానించి కండువా కప్పారు.
అనంత జిల్లాల్లో గత 2014 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన సీట్లు కేవలం రెండంటే రెండే. అందులోనూ ఒకరు వైసీపీలోకి జంప్ అవ్వగా మిగిలింది.. ఏక్ నిరంజన్.! ఈ క్రమంలో పార్టీలోకి ఎవరొచ్చినా సరే కండువా కప్పేస్తోంది వైసీపీ. మరీ ముఖ్యంగా అనంతలో జేసీ బ్రదర్స్‌ను ఢీ కొట్టాలంటే చాలా కష్టమే. అయితే జేసీపైనే మీసం మెలేసిన గోరంట్లను అనంత ఎంపీగా బరిలోకి దింపాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా.. మాధవ్‌కు యూత్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. ఇటీవలి కాలంలో బాగా పాపులర్ అయిన వ్యక్తి కూడా. రాజకీయ పార్టీలను అడ్డంపెట్టుకుని దందాలు చేసేవారిపై ఆయన కఠినంగా వ్యవహరించిన దమ్మున్నోడు. వృత్తి పట్ల నిబద్ధత, నిజాయతీ ఆయనకు ప్రజల్లో మంచి క్రేజ్ ను సంపాదించిపెట్టాయి. ఇన్ని సంచలనాలకు కేంద్రబిందువైన గోరంట్ల మాధవ్ వైసీపీ తరఫున రాజకీయ అరంగేట్రం చేశారు. అయితే వృత్తిలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న మాధవ్ రాజకీయాల్లో ఏమేరకు సఫలీకృతమవుతారో? వైసీపీ అధిష్టానం ఆయన్ను ఎంత వరకు గుర్తించి సీటిస్తుంది..? అనే విషయం తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే మరి.