స్పీకర్ పదవికి రోజా, ఆనం నో.. ఇక ఆయనే ఫిక్స్!?
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్ర్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ విజయ దుందుభి మోగించిన తర్వాత ఎవరి నోట చూసినా ఒకే మాట.. ఎవరెవరు మంత్రులవుతున్నారు..? స్పీకర్ ఎవరు..? ఇంతకీ చంద్రబాబు అధ్యక్షా అని ఎవర్ని అనబోతున్నారు..? అని సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే ఎన్నికల ఫలితాల ముందు అందరూ దగ్గుపాటి వెంకటేశ్వరరావు స్పీకర్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని.. ఆయన తనకు మంత్రి పదవి ఇవ్వకపోయిన ఫర్లేదు కానీ.. కచ్చితంగా స్పీకర్ పదవి మాత్రం ఇచ్చి తీరాల్సిందేనని జగన్‌ను గట్టిగా పట్టుబట్టినట్లు వార్తలు వినవచ్చాయి. ఇందుకు కారణం తనను మోసం చేసిన చంద్రబాబు చేత తానే అధ్యక్షా.. అనిపించుకోవాలన్నదే దగ్గుపాటి ఏకైక కోరిక. అయితే పాపం.. ఆ అదృష్టం దగ్గుపాటి లేకుండా పోయింది. వైసీపీ తరఫున పరుచూరు నుంచి పోటీచేసిన దగ్గుపాటి ఘోరంగా ఓడిపోయారు.
దగ్గుపాటి ఓటమి.. ఇక ఆయనేనా!
దగ్గుపాటి ఓడిపోవడంతో స్పీకర్ అయ్యేదెవరు..? ఆ అదృష్టం ఎవరికుంది అని అందరూ చర్చించుకుంటున్నారు. అయితే ఉన్నట్లుండి అనూహ్యంగా నగరి నుంచి గెలిచిన సినీ నటి ఆర్‌కె రోజా, మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఆనం రాంనారయణ రెడ్డి, అంబటి రాంబాబు పేర్లు ప్రముఖంగా వచ్చాయి. అయితే వారిద్దరూ కూడా సుముఖంగా లేరని.. ఇద్దరూ మంత్రి పదవులు కోరుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ తరుణంలో బాపట్ల నుంచి గెలుపొందిన సీనియర్ ఎమ్మెల్యే కోన రఘుపతి పేరు దాదాపు ఖరారైందని.. ఇక అధికారికంగా ప్రకటనే తరువాయి అని ప్రచారం జోరుగా సాగుతోంది.
సౌమ్యుడు, విద్యావంతుడు!
కాగా.. కోన రఘుపతి ఉన్నత విద్యా వంతుడు కావడం, వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం సౌమ్యుడిగా గుర్తింపుతో పాటు అసెంబ్లీ వ్యవహారాలపై మంచి పరిజ్ఞానం నేపథ్యంలో కోన రఘుపతి వైపు వైసీపీ పెద్దలు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. కోన రఘుపతి పేరు ఫిక్స్ చేయాలని జగన్ ఓ నిర్ణయానికొచ్చారని సమాచారం. ఇదిలా ఉంటే డిప్యూటీ స్పీకర్‌గా కురుపాం నుంచి గెలిచిన పుష్ప శ్రీవాణిని నియమించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాగా ప్రస్తుతం ఇంకా మంత్రి వర్గ విస్తరణ ఈ కార్యక్రమాలేమీ లేకపోవడంతో త్వరలోనే స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లపై ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది. అయితే ఎంతమంది మంత్రి పదవులకు పోటీ పడతారో,.. ఫైనల్‌గా స్పీకర్ సీటులో ఎవరు కూర్చుంటారో తెలియాలంటే మరో వారం రోజులు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout