దిల్ రాజు ఆ విష‌యంలో హ్యాట్రిక్ కొడ‌తారా?

  • IndiaGlitz, [Friday,June 29 2018]

ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు.. వీళ్ళంతా మల్టీస్టారర్ మూవీస్‌తో సందడి చేసినవారే. అయితే.. క్రమేణా ఈ సినిమాలు కనుమరుగైపోయాయి. ఇలాంటి త‌రుణంలో.. అగ్ర క‌థానాయ‌కులు వెంకటేష్, మహేష్ బాబు కాంబినేష‌న్‌లో ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ను నిర్మించ‌డ‌మే కాకుండా ఘ‌న‌విజ‌యాన్ని అందుకున్నారు స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ దిల్‌ రాజు. ఆ మల్టీస్టారర్ మూవీని సంక్రాంతి పండుగ సందర్భంగా 2013లో విడుదల చేసారు.

ఈ చిత్రం అందించిన విజయంతో.. 2014 సంక్రాంతికి మెగా హీరోస్ అల్లు అర్జున్, రామ్ చరణ్ కథానాయకులుగా ‘ఎవడు’ అనే మ‌రో మ‌ల్టీస్టార‌ర్‌ని నిర్మించి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ మూవీ కూడా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

కట్ చేస్తే.. మ‌ళ్ళీ నాలుగేళ్ళ‌ తర్వాత మరో మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ని నిర్మిస్తున్నారు ‘దిల్’ రాజు. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని కూడా సంక్రాంతికే తీసుకురానుండ‌డం విశేషం. మరి ఇప్పటికే రెండు మల్టీస్టారర్ మూవీస్‌తో రెండు సార్లు సంక్రాంతి విజయాలను అందుకున్న ‘దిల్’ రాజు.. ఈ చిత్రంతో ఆ జోన‌ర్‌లో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుని సంక్రాంతి సెంటిమెంట్‌ను పున‌రావృతం చేస్తారేమో చూడాలి.

అన్న‌ట్టు.. గ‌తేడాది సంక్రాంతికి 'శ‌త‌మానం భ‌వ‌తి' చిత్రంతో ప‌ల‌క‌రించిన దిల్ రాజు సంస్థ‌కు.. సంక్రాంతి సెంటిమెంట్ అన్నిర‌కాలుగా క‌లిసొస్తుంద‌నే చెప్పాలి.