భీమవరంను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతా...
- IndiaGlitz, [Saturday,March 23 2019]
భీమవరం ప్రజల ప్రేమానుబంధాలు నన్ను కట్టిపడేశాయి. ఈ పట్టణాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడం నా బాధ్యత. రాజకీయం భావజాలంతో ముడిపడి ఉండాలి కానీ కులంతో కాదని, తనకు కులం మతం లేదు మానవత్వమే ఉంది అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం శాసనసభ నియోజకవర్గం నుంచి పవన్ నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో జరిగిన ఈ నామినేషన్ వేడుకకు భారీగా అభిమానులు తరలివచ్చారు.
మన బిడ్డల భవిష్యత్ కోసం అడుగుతున్నా..
నేను రాజకీయాల్లోకి వచ్చింది జేజేలు కొట్టించుకోవడానికి కాదు. డబ్బు సంపాదించడానికి కాదు. దశాబ్దాలుగా ఇంత మంది ఎమ్మెల్యేలు పని చేశారు. ఇప్పటి వరకూ ఏ ఎమ్మెల్యే ఏం చేశారో తెలియదు. నన్ను భీమవరం ఎమ్మెల్యేని చేయండి. నాకు అవకాశం ఇస్తే భీమవరంని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతాను. విశ్వనగరంగా తయారు చేసే బాధ్యత తీసుకుంటాను. నా కోసం కాదు మన బిడ్డల భవిష్యత్తు కోసం అడుగుతున్నా. నేను మీ సేవకుడిని.. మీతో చప్పట్లు కొట్టించుకోవడానికో, భుజాల మీద ఎక్కి నడిచే నాయకుడ్నో కాదు. ఇప్పటి వరకు ఉన్న ఎమ్మెల్యేలు వేల కోట్లు సంపాదించుకుంటున్నారుగానీ, డంపింగ్ యార్డు తరలించలేకపోయారు అని పవన్ చెప్పుకొచ్చారు.
అల్లూరి స్పూర్తితో పనిచేస్తా...
ఇక్కడ పుట్టి ఏజెన్సీలో గిరిజనుల కోసం బ్రిటీష్‌కి ఎదురెళ్లిన అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో పనిచేస్తాను. జనసేన పార్టీ స్థాపించినప్పుడు నా అకౌంట్‌లో కోటీ 60 లక్షల రూపాయిలు మాత్రమే ఉన్నాయి. పార్టీ పెట్టడానికి భావజాలం కావాలి గాని డబ్బు అవసరం లేదని భావించా. ధైర్యంగా ముందుకి వచ్చా. ధైర్యం ఉన్న చోట లక్ష్మి ఉంటుంది. భీమవరం ప్రజల ప్రేమ మరవలేను. బీమవరం వాసులతో నాకు ఎంతో అనుబంధం ఉంది. నా ఇల్లు కట్టించింది భీమవరం వాసే. పార్టీని ముందుకి తీసుకువెల్లడానికి సహకరించిన మిత్రుడు కనకరాజు సూరి, నా మీద నమ్మకంతో వచ్చిన ఇర్రింకి సూర్యారావులకు ధన్యవాదాలు అని జనసేనాని తెలిపారు.