Telangana Congress: కాంగ్రెస్ ఈసారైనా అధికారంలోకి వస్తుందా..? కేసీఆర్‌ను ఢీ కొడుతుందా..?
- IndiaGlitz, [Tuesday,October 10 2023]
రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కడంతో కాంగ్రెస్ పార్టీ కూడా దూకుడు పెంచింది. త్వరలోనే అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడింది. ఇప్పటికే ఆరు గ్యారంటీ హామీలతో జోష్ మీదున్న హస్తం పార్టీ.. మరిన్ని హామీలు ఇచ్చేందుకు కసరత్తులు మొదలుపెట్టింది. కాంగ్రెస్ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది. నేతల మధ్య ఆధిపత్య పోరు తీవ్రంగా ఉంటుంది. దీంతో ఆ పార్టీ భారీ మూల్యం చెల్లించుకుంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చాక 2014 ఎన్నికలను ఎదుర్కొన్న కాంగ్రెస్ ఆ ఎన్నికల్లో సరైన పోల్ మేనేజ్‌మెంట్ చేయలేకపోవడంతో పాటు అతి విశ్వాసం, ఐక్యంగా ప్రజల్లోకి వెళ్లకపోవడం వంటి కారణాలతో బొక్కబోర్లా పడింది. కేవలం 22 స్థానాలకే పరిమితమై ప్రతిపక్ష స్థానానికే పరిమితమైంది.
కేసీఆర్ ముందు నిలవలేకపోయిన కాంగ్రెస్ నేతలు..
2014 ఎన్నికల ఓటమి తర్వాత కాంగ్రెస్ నేతలు సీఎం కేసీఆర్ ముందు నిలవలేకపోయారు. కేసీఆర్‌ను ఎదుర్కొనే లీడర్ లేకపోవడంతో హస్తం పార్టీ పూర్తిగా డీలా పడిపోయింది. అదే సమయంతో నేతల మధ్య కుమ్ములాటలతో పార్టీ క్యాడర్ నిస్తేజం అయిపోయింది. కొంతమంది కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయిపోయారు. దీంతో ఆ పార్టీ మరింత వెనకంజలో పడిపోయింది. 2018 ఎన్నికల దాకా ప్రభుత్వంపై ప్రతిపక్ష హోదాలో సరైన పోరాటం చేయలేదు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి ధీటుగా మరో పార్టీ లేకపోవడంతో ప్రజలు కూడా గులాబీ చెంతే చేరారు.
2018లో తీవ్రంగా దెబ్బ కొట్టిన టీడీపీతో పొత్తు..
అసలే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు 2018లో టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లింది. దీంతో కాస్తో కూస్తో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత ఆంధ్ర, తెలంగాణ సెంటిమెంట్‌తో మరుగన పడిపోయింది. అప్పుడు ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు తెలంగాణలో కాంగ్రెస్ తరపున ప్రచారం చేయడంతో కేసీఆర్.. మళ్లీ ఆంధ్రోళ్లు మనల్ని దోచుకోవడానికి వస్తున్నారంటూ జనాల్లోకి బాగా తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. కేవలం 19 స్థానాలకే పరిమితమైంది.
గ్రేటర్ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతు..
రెండో సారి కూడా అధికారం కోల్పోవడంతో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్‌లో చేరిపోయారు. దీంతో ఆ పార్టీ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. పార్టీని నడిపే నాయకుడు లేక అథ:పాతాళానికి పడిపోయింది. అదే సమయంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రావడం ఆ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా కోల్పోవడంతో ఇక కాంగ్రెస్ పరిస్థితి అయిపోయిందనే అంచనాకు వచ్చేశారు. వెను వెంటనే జరిగిన దుబ్బాక, హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా డిపాజిట్లు కోల్పోయింది.
కాంగ్రెస్‌కు ఊపిరి అందిచ్చిన కర్ణాటక ఎన్నికల ఫలితాలు..
దీంతో కాంగ్రెస్ ఇక కోలుకోవడం కష్టమని భావిస్తున్న తరుణంలో కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఊపిరి ఇచ్చినట్లైంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో తెలంగాణ కాంగ్రెస్‌లో కూడా ఫుల్ జోష్ వచ్చింది. బీజేపీలో చేరాలనుకున్న నేతలందరూ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో బీఆర్ఎస్‌ను ధీటుగా ఎదుర్కొనే పార్టీగా కాంగ్రెస్ నిలిచింది. ఇటీవల జరిగిన కొన్ని సర్వేల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తేలింది. మరి ఐక్యంగా పోరాడి మూడోసారైనా అధికారంలోకి వస్తుందా..? బలమైన కేసీఆర్‌ను ఎదుర్కొని విజయ తీరాలకు చేరుతుందా..? తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తుందా..? తెలియాలంటే డిసెంబర్ 3 వరకు ఆగాల్సిందే.