జగన్‌ ప్రమాణానికి చిరు, పవన్ వస్తారా..!

  • IndiaGlitz, [Wednesday,May 29 2019]

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మే-30న విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం వేదికగా.. ‘జగన్ అనే నేను..’ అని ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు స్వయంగా జగన్ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. మరికొందరు ప్రముఖులకు జగన్ స్వయంగా ఫోన్ చేసి ప్రమాణానికి రావాలని సాదరంగా ఆహ్వానించారు.

అన్నదమ్ములకు జగన్ ఫోన్..!

మరీ ముఖ్యంగా కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు స్వయంగా జగన్ ఫోన్ చేసి రేపు జరగబోయే ప్రమాణ స్వీకారానికి హాజరుకావాలని ఆహ్వానించారు. మరోవైపు దివంగత ముఖ్యమంత్రిగా వైఎస్ ఆత్మగా పేరుగాంచిన కేవీపీకి కూడా ఫోన్ చేసి తప్పకుండా హాజరుకావాలని జగన్ కోరారు. కార్యక్రమానికి వచ్చేవారంతా 10:30 లోపు స్టేడియంకు చేరుకోవాలని మరోవైపు నేతలు చెబుతున్నారు. గురువారం మధ్యాహ్నం సరిగ్గా.. 12:23 గంటలకు జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

విజయవాడ చేరుకున్న నరసింహన్..

ఇదిలా ఉంటే.. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ విజయవాడకు చేరుకున్నారు. హైదరాబాద్‌ నుంచి ఇవాళ ఉదయం 11 గంటలకే గన్నవరం వెళ్లారు. గవర్నర్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ ఆర్‌పీ ఠాకూర్‌, కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ స్వాగతం పలికారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా రోడ్డు మార్గంలో విజయవాడలోని గేట్‌వే హోటల్‌కు గవర్నర్‌ చేరుకున్నారు. ఇవాళ రాత్రి అక్కడే బస చేసి రేపు మధ్యాహ్నం 12:23 గంటలకు జగన్‌ చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

పెద్దలందరికీ ఆహ్వానం..!

కాగా.. బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌, కన్నా లక్ష్మీనారాయణ, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిలకు ఫోన్‌ చేసి తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని కోరారు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి ఫోన్‌ చేసిన వైఎస్‌ జగన్‌ తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే పవన్, చిరుకు ఆహ్వానాలు అందాయి సరే.. వీళ్లు కూడా చంద్రబాబు మాదిరే రాలేనని చెప్పేస్తారా..? అనేది తెలియాల్సి ఉంది.