BRS: బీఆర్ఎస్ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తుందా..? సెంచరీ కొడుతుందా..?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. గెలుపే లక్ష్యంగా పార్టీలు వ్యూహరచనలతో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు సిద్ధమైంది. సీఎం కేసీఆర్ ఈ మేరకు ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రతిపక్షాలకు ధీటుగా ప్రజాకర్షణ మేనిఫెస్టో రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు. తెలంగాణ కోసం పోరాడిన నాయకుడిగా, ప్రత్యేక రాష్ట్రం తెచ్చిన నాయకుడిగా కేసీఆర్‌కు రాష్ట్ర ప్రజల్లో ప్రత్యేక అభిమానం పొందారు. తెలంగాణ గురించి కేసీఆర్‌కు ఉన్నంత అవగాహన మరే నాయకుడికి లేదన్నది కాదనలేని వాస్తవం.
ఈ ఎన్నికల్లో సెంచరీ కొడతామని బీఆర్ఎస్ నేతల ధీమా..
2014 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసి ఉద్యమ చైతన్యంతో 63 స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చారు కేసీఆర్. నాలుగన్నర సంవత్సరాల పాటు కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని తనదైన శైలిలో పాలిస్తూ వచ్చారు. అయితే ప్రతిపక్షాలకు చెక్ పెట్టేందుకు ఆరు నెలల ముందే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. అనుకున్నట్లుగానే 2018లో జరిగిన ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువ స్థానాలో విజయ దుందుభి మోగించారు. ఏకంగా 88 మంది స్థానాల్లో గెలిచి రెండోసారి అధికారంలోకి వచ్చారు. తొలిసారి కన్నా 25 అసెంబ్లీ స్థానాలను అదనంగా గెలుచుకుంది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి జరుగుతున్న ఎన్నికల్లో సెంచరీ కొడతామని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే 119 స్థానాలకు గాను 115 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించి ఎన్నికల రేసులో ముందున్నారు.
ప్రభుత్వ వ్యతిరేకతను ఎలా ఎదుర్కొంటారు..?
అయితే 2014, 18 ఎన్నికలను తెలంగాణ పార్టీగా ఎదుర్కొన్న కేసీఆర్.. అందుకు తగ్గట్లే ప్రాంతీయ అభిమానంతో అధికారంలోకి వచ్చారు. అయితే ఈసారి మాత్రం ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ కాస్త జాతీయ పార్టీ బీఆర్ఎస్గా మారింది. దీంతో ఈ ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్‌కు ఆస్కారం ఉండదు. అంతేకాకుండా రెండు సార్లు అధికారంలో ఉండటంతో సహజంగానే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటుంది. మరి ఆ వ్యతిరేకతను కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి. తనదైన శైలిలో మరిన్ని ఆకర్షణీయమైన హామీలు ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత..
ముఖ్యంగా నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. గ్రూప్1 పరీక్ష పేపర్లు లీక్ కావడం, ఆ పరీక్షలను హైకోర్టు రద్దు చేయడం.. అలాగే గ్రూప్2 పరీక్షలను రద్దు చేయడం, ఇప్పుడు కానిస్టేబుల్ నియామక ఫలితాలను న్యాయస్థానం రద్దు చేయడంపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ప్రభుత్వ పరీక్షలు సరిగ్గా నిర్వహించలేని ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటుందని ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నారు. మరి నిరుద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని గులాబీ బాస్ ఎలా ఎదుర్కొంటురనేది ఆసక్తి మారింది.
మరిన్ని ప్రజారంజక పథకాల ప్రకటనకు ఆస్కారం..
అయితే జనం నాడి బాగా తెలిసిన కేసీఆర్ ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం, ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, సింగరేణి కార్మికులకు దసరా బోనస్, లక్ష రూపాయల లోపు రైతు రుణ మాఫీ ప్రకటించారు. ఇలాంటి మరిన్ని అస్త్రాలు తమ అమ్ములపొదిలో ఉన్నాయని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. త్వరలో ప్రవేశపెట్టబోయే మేనిఫెస్టోలో మరిన్ని ప్రజారంజక పథకాలు ప్రకటిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈసారి కూడా అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి బీఆర్ఎస్ మూడో సారి అధికారంలోకి వస్తుందా..? రాదా..? తెలంగాణ ప్రజలు ఎటు నిలుస్తారో తెలియాలంటే డిసెంబర్ 3వరకు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments