BRS:జాతీయ పార్టీగా మారిన బీఆర్‌ఎస్.. తెలంగాణ సెంటిమెట్‌ను మళ్లీ తెరపైకి తెస్తుందా..?
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా ఉద్యమ పార్టీగా 2001లో కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్) పార్టీ ఏర్పడింది. అప్పటి నుంచి తెలంగాణ కోసం ఉద్యమం చేస్తూ పోరాడింది. 2014లో తెలంగాణ రాష్ట్రం సాధించాక రెండు సార్లు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. 2022 వరకు తెలంగాణ ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లోపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే పార్టీ అధినేత సీఎం కేసీఆర్ భారతీయ రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్)గా పేరు మారుస్తూ జాతీయ పార్టీగా ప్రకటించారు. అప్పటి నుంచి తెలంగాణ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ జాతీయ పార్టీగా అవతరించింది.
దేశాన్ని అభివృద్ధి చేయడమే బీఆర్ఎస్ లక్ష్యం..
జాతీయ రాజకీయాల్లో మార్పు తీసుకువచ్చి భారతదేశాన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని కేసీఆర్ పదేపదే ప్రకటించారు. ఈ క్రమంలోనే వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ జాతీయ నేతలను కలిశారు. మహారాష్ట్రతో పాటు పక్క తెలుగు రాష్ట్రమైన ఏపీలో కూడా పార్టీ ఆఫీసులు ఏర్పాటు చేశారు. దేశ వ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపారు. అయితే ఇటీవల జాతీయ రాజకీయాలపై అంతగా ఫోకస్ చేయడం లేదు. ఈలోపే తెలంగాణ ఎన్నికలకు నగారా మోగడంతో బీఆర్ఎస్ నేతలంతా ఎన్నికల సమరానికి దిగారు.
తెలంగాణను ఆంధ్రాలో కలపాలని చూస్తున్నారంటూ వ్యాఖ్యలు..
ఎన్నికల ప్రచారంలో ఉన్న నేతలు మరోసారి ఆంధ్రా-తెలంగాణ సెంటిమెంట్‌ను తెరపైకి తీసుకొస్తున్నారు. ఆంద్రా వాళ్ళు కాంగ్రెస్ ముసుగుతో వచ్చి తెలంగాణాను ఆంధ్రాలో కలపాలని చూస్తున్నారు అంటూ మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలను నమ్మవద్దని వారిని నమ్మితే తెలంగాణను ఆంధ్రాలో కలిపేస్తారు అంటూ తెలిపారు. హైదరాబాద్ సంపద కొల్లగొట్టడానికి వచ్చే నేతలను, పార్టీలను నమ్మవద్దు అంటూ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై విమర్శలు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణతో ఏం సంబంధమని ప్రశ్నించారు. అయితే కమలాకర్ వ్యాఖ్యలను ప్రతిపక్షాల నేతలు తప్పుపడుతున్నారు.
ఎన్నికల్లో గెలవడానికి తెలంగాణ సెంటిమెంట్ తెరపైకి..
జాతీయ పార్టీగా మారిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం గురించి ఎలా మాట్లాడతారని ప్రశ్నిస్తున్నారు. జాతీయ పార్టీకి అన్ని రాష్ట్రాలు ఒక్కటే కదా అని నిలదీస్తున్నారు. కేవలం ఎన్నికల్లో మళ్లీ గెలవడం కోసం మరోసారి తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకోవాలని చూస్తున్నారని మండిపడుతున్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఇలాగే ఆంధ్రోళ్లు పేరు చెప్పి ఓటర్లను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మాత్రం దానికి బీఆర్ఎస్ అని పేరు మార్చుకోవడం ఎందుకని ఫైర్ అవుతున్నారు. బీఆర్ఎస్ నేతల మాటలు మళ్లీ మళ్లీ నమ్మడానికి ప్రజలెవరూ సిద్ధంగా లేరని చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments