Download App

Wild Dog Review

సర్జికల్‌ స్ట్రైక్స్‌ పట్ల దేశంలో మెజార్టీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. భారతగడ్డపై అశాంతి సృష్టిస్టూ, అమాయక ప్రజల ప్రాణాల్ని పొట్టనపెట్టుకుంటున్న తీవ్రాదుల్ని కాల్చడంలో తప్పులేదని ప్రజల అభిప్రాయం. ఈ నేపథ్యంలో వచ్చిన ‘ఉరి: ద సర్జికల్‌ స్ట్రైక్స్‌’ భారీ విజయం సాధించింది. అంతకు ముందు నేపాల్‌, సౌదీలో టెర్రరిస్టుల్ని పట్టుకోవడానికి భారతీయ అధికారులు ఎటువంటి సీక్రెట్‌ ఆపరేషన్‌ చేశారనే కథతో వచ్చిన ‘బేబీ’ సైతం భారీ విజయం సాధించింది. టెర్రరిజం అరికట్టడం కోసం హీరో చేసే కృషిలో విపరీతమైన హీరోయిజం ఉంటుంది. అందుకని, ఆ చిత్రాలకు అంత క్రేజ్‌. ఉదాహరణకు, ‘ఖడ్గం’లో హీరో శ్రీకాంత్‌ రోల్‌. అయితే, తెలుగులో ఈ నేపథ్యంలో రియాల్టీకి దగ్గరగా వచ్చిన చిత్రాలు తక్కువ. ఈ మధ్య ‘గూఢాచారి’, ‘గరుడవేగ’ వచ్చాయంతే. మిగతా సినిమాల్లో కమర్షియాలిటీ ఎక్కువ వుంటుంది. మరి, నాగార్జున హీరోగా చేసిన ‘వైల్డ్‌ డాగ్‌’ ఎలా వుంది? రివ్యూలో చూద్దాం!

కథ:

విజయ్‌ వర్మ (నాగార్జున) ఎన్‌ఐఎ ఆఫీసర్‌. డిపార్ట్‌మెంట్‌లో ‘వైల్డ్‌ డాగ్‌’గా పేరున్న అతడు టెర్రరిస్టుల్ని ఎన్కౌంటర్‌ చేయడం తప్ప, అరెస్ట్‌ చెయ్యడు. హైదరాబాద్‌లో ఓ కేసు విషయమై ఎన్కౌంటర్‌ చెయ్యడంతో డెస్క్‌ జాబ్‌కి షిప్ట్‌ చేస్తారు. పుణెలో జాన్‌ బేకరీ (ఒరిజినల్‌గా జర్మన్‌ బేకరీ)లో బాంబు పెలుడు తర్వాత మళ్ళీ అతడ్ని పిలుస్తారు. అందుకు కారణమైన వాళ్ళను పట్టుకోమని చెప్తారు. ఇన్వెస్టిగేషన్‌ చేస్తున్న టైమ్‌లో హైదరాబాద్‌లో రెండు ఏరియాల్లో పేలుళ్ళు సంభవిస్తాయి. వీటి సూత్రధారి ఖాలిద్‌ అలియాస్‌ యాసిన్‌ భత్కాల్‌ని పట్టుకోవడానికి విజయ్‌ వర్మ బృందం ఏం చేసిందనేది సినిమా.

ఎనాలసిస్‌:

రియాల్టీగా దగ్గరగా సినిమా తీసినందుకు ముందుగా యూనిట్‌ని అప్రిషియేట్‌ చెయ్యాలి. ఎటువంటి కమర్షియల్‌ ఎలిమెంట్స్‌, హీరోయిజం జోలికి పోలేదు. యంగ్‌గా కాకుండా వయసు ఛాయలు కనిపించే క్యారెక్టర్‌ సెలెక్ట్‌ చేసుకున్న నాగార్జునను మెచ్చుకోవాలి. సినిమాలో పాటల్ని ఇరికించలేదు. అదో ప్లస్‌ పాయింట్‌. నెక్ట్స్‌ ఏం జరుగుతుందోనని ఆడియన్స్‌లో టెన్షన్‌ బిల్డ్‌ చేసే విధంగా సినిమా తీయడంలో మేకర్స్‌ సెంట్‌ పర్సెంట్‌ సక్సెస్‌ కాలేదు. టెర్రరిస్ట్‌ ఎవరో తెల్సిన తర్వాత వచ్చే సీన్స్‌ మరింత గ్రిప్పింగ్‌గా రాసుకోవాల్సింది. అయితేనేం? ఆడియన్స్‌కి సినిమా కొత్త ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది.

సినిమా స్టార్టింగ్‌ స్లోగా ఉంటుంది. కొంత టైమ్‌ తీసుకున్నాక నిదానంగా ఆడియన్స్‌ సినిమాలోకి వెళ్తారు. టెర్రరిస్ట్‌ దొరికినట్టే దొరికి చివరి క్షణంలో మిస్‌ అవుతుంటే ఆడియన్స్‌ ‘అయ్యో’ అనుకుంటారు. సెకండాఫ్‌ బెటర్‌. మోస్ట్‌ ఇంపార్టెంట్‌ క్లైమాక్స్‌ పార్ట్‌. టెన్షన్‌ బిల్డ్‌ చేశారు. తెలుగులో ఇటువంటి ఎటెంప్ట్‌ని అప్రిషియేట్‌ చెయ్యాలి. అయితే, ఏదో మిస్‌ అయిన ఫీలింగ్‌. టెర్రరిస్ట్‌ని పట్టుకోవడానికి ఎన్‌ఐఎ ఆఫీసర్లు వేసే ఎత్తుగడల్ని మరింత థ్రిల్‌ ఇచ్చేలా చూపించాల్సింది. స్ర్కీన్‌ప్లే, యాక్షన్‌ సీన్స్‌ కంపోజింగ్‌ క్రిస్ప్‌గా వుంటే ఎక్కువ థ్రిల్‌ వచ్చేది. తమన్‌ నేపథ్య సంగీతం సినిమాకి కొన్ని చోట్ల ప్లస్‌ అయ్యింది.

నాగార్జున పాత్రలో ఒదిగిపోయారు. ఆయన బృందంలో నటించినవారిలో ప్రదీప్‌ నటన సహజంగా వుంది. అలీ రేజాకి మంచి పాత్ర దక్కింది. అతడు బాగా చేశాడు. సయామీ ఖేర్‌, మిగతావాళ్ళ నటన ఓకే. అతుల్‌ కులకర్ణి ఇటువంటి రోల్స్‌ చేయడంలో ఎక్స్‌పర్ట్‌. అనీష్‌ కురువిల్లాది చిన్న రోల్‌. దియా మీర్జాది స్పెషల్‌ అప్పియరెన్స్‌. టెర్రరిస్ట్‌గా చేసిన వ్యక్తి లుక్‌ ఆ రోల్‌కి సూట్‌ అయ్యింది.

ఫైనల్‌గా... వరల్డ్‌ సినిమా చూసే ఆడియన్స్‌కి, ‘బేబీ’, ‘ఉరి’ చూసినవాళ్ళకు ‘వైల్డ్‌ డాగ్‌’ సోసోగా అన్పిస్తుంది. మిగతా తెలుగు ప్రేక్షకులకు కొత్త ఫిల్మ్‌ చూసిన ఫీలింగ్‌ ఉంటుంది. హాట్ స్టార్ లో వచ్చిన స్పెషల్ ఓపీఎస్ ఈ టైపులో వుంటుంది.

Read Wild Dog Review in English
 


 
Rating : 2.8 / 5.0