ఫిబ్రవరి 1నే బడ్జెట్ ఎందుకు ప్రవేశపెడతారు..? దీని వెనక కారణాలేంటి..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఏ దేశమైనా ఆర్థికంగా ముందుకు నడవాలంటే బడ్జెట్ చాలా ముఖ్యం. ప్రతి ఏటా బడ్జెట్ ప్రవేశపెట్టడం తప్పనిసరి. అలాగే మన దేశంలో కూడా బడ్జెట్‌పై సామాన్యుల నుంచి ప్రముఖులు వరకు ఉత్కంఠగా ఎదురుచూస్తూ ఉంటారు. ఎందుకంటే బడ్జెట్‌లో వేటి ధరలు పెరుగుతాయి.. వేటి ధరలు తగ్గుతాయి.. ఏ రంగాలకు ఊతం కలుగుతుంది.. రైతులకు ఎలాంటి పథకాలు పెడుతున్నారు.. అనే లెక్కలు చూసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం దేశమొత్తం బడ్జెట్ గురించే ఆలోచిస్తుంది. మరో వారం రోజులు మాత్రమే ఉండటంతో కళ్లన్నీ దీనిపైనే ఉన్నాయి. ఎలాంటి వరాలు ఇస్తారు..? వాతలు పెడతారు..? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
బడ్జెట్‌లో రెండు రకాలు..
ఈ ఏడాది ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఆరో సారి పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈసారి లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటాన్ బడ్జెట్ ప్రకటించనున్నారు. ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు ఓటాన్ బడ్జెట్‌ను నిర్మలమ్మ పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. వాస్తవంగా ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి పూర్తి బడ్జెట్, మరొకటి ఓటాన్ బడ్జెట్. పూర్తి స్థాయి బడ్జెట్‌లో ట్యాక్స్ స్లాబ్‌లు మార్చడం, కొత్త స్కీమ్స్‌ను ప్రకటించడం, వివిధ రంగాలకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకోవడం వంటివి ఉంటాయి.
ఈసారి ఓటాన్ బడ్జెట్..
ఎన్నికల ఏడాదిలో ప్రకటించే బడ్జెట్‌ను ఓటాన్ బడ్జెట్ అంటారు. ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం పన్నులు, కొత్త స్కీమ్స్ వంటివి ఉండవు. కొత్త ప్రభుత్వం అధికారంలో వచ్చేంత వరకు ఖర్చుల కోసం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఈ బడ్జెట్‌ను ప్రవేశపెడుతంది. దీనిని మధ్యంతర బడ్జెట్ లేదా ఇంటీరియమ్ బడ్జెట్ అని కూడా అంటారు. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం మళ్లీ పూర్తి స్తాయి బడ్జెట్‌ను ఆవిష్కరిస్తుంది.
బ్రిటీష్ పాలనలో సా.5 గంటలకు..
వాస్తవంగా దేశానికి స్వాతంత్రం రాక ముందు అంటే బ్రిటీష్ పరిపాలనలో ఫిబ్రవరి నెలలో చివరి పని దినం రోజు సాయంత్రం 5 గంటలకు కేంద్ర బడ్జెట్‌ను సమర్పించేవారు. యునైటెడ్ కింగ్‌డమ్ సమయం కంటే భారత్‌లో సమయం నాలుగున్నర గంటలు ముందుంటుంది. అందుకే ఇక్కడ సాయంత్రం పూట బడ్జెట్‌ను ప్రవేశపెడితే యూకే కాలమానం ప్రకారం పగటి పూట బడ్జెట్ ప్రకటించినట్లు అవుతుంది. అందుకే సాయంత్రం 5 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టేవారు. స్వాతంత్ర్యం వచ్చాక కూడా ఇదే సాంప్రదాయాన్ని కొనసాగించారు.
ఉ.11గంటలకు మార్చిన వాజ్‌పేయి సర్కార్..
అయితే 1999లో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం ఈ సమయాన్ని మార్చింది. అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా బ్రిటీష్ పద్ధతులను ఎందుకు పాటించాలని ప్రశ్నించారు. ఉదయం 11 గంటలకు బడ్జెట్ సమర్పించాలని ప్రతిపాదించారు. ఉదయం పూట బడ్జెట్ ప్రవేశపెడితే.. పార్లమెంటులో కూడా చర్చకు అవకాశం దొరుకుతుందని తెలిపారు. దీంతో 1999 ఫిబ్రవరి 27న ఉదయం 11 గంటలకు ఆర్ధిక బడ్జెట్‌ను యశ్వంత్ సిన్హా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది.
>మోదీ హయాంలో బడ్జెట్ తేదీ మార్పు..
2017 వరకు ఫిబ్రవరి నెలలోని చివరి పని దినం రోజున కేంద్ర బడ్జెట్‌ను సమర్పించేవారు. 2017లో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ తేదీని మార్చారు. అప్పుటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి ఫిబ్రవరి నెల చివరి రోజున బడ్జెట్‌ను సమర్పిస్తే.. కొత్త ఆర్థిక సంవత్సరానికి సమాయత్తం కావడానికి సమయం తక్కువగా ఉంటుంది. అదే ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్ సమర్పిస్తే ఎక్కువ సమయం దొరుకుతుంది. ఇక అప్పటి నుంచి ఏటా ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్‌ను సమర్పిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout