నాగ్‌ను టార్గెట్ చేసిన రాములమ్మ.. అసలేం జరుగుతోంది!?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు మొదలుకుని నేటి వరకూ టీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి అలియాస్ రాములమ్మ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ పెట్టే ప్రతీ సమీక్షా సమావేశానికి, ప్రెస్‌మీట్‌కు రాములక్క సోషల్ మీడియా వేదికగా కౌంటర్ల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు కేసీఆర్‌పై ప్రశ్నాస్త్రాలు, విమర్శనాస్త్రాలు విసిరిన విజయశాంతి తాజాగా రెవెన్యూ రికార్డులు, అక్రమాస్తుల ఎపిసోడ్ అంటూ ఫేస్‌బుక్ వేదికగా పోస్ట్ చేశారు. కాగా ఇందులో టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున పేరే హైలైట్ చేస్తూ పదే పదే కేసీఆర్‌ను ప్రశ్నించడం గమనార్హం. అయితే నాగ్ పేరు వెలుగులోకి రావడంతో సినిమాలు మొదలుకుని అన్ని విషయాల్లో నాగ్‌తో మంచి స్నేహం సాగించే రాములక్క సడన్‌గా ఆయన్ను రోడ్డు మీదికి లాగే ప్రయత్నం చేస్తున్నారబ్బా అంటూ ఆలోచనలో పడ్డారు. అసలు ఆమె పోస్ట్ సారాంశం ఏంటి...? నాగార్జున గురించి ఏం చెప్పారు..? డ్రగ్స్ విషయం మళ్లీ ఎందుకు తెరపైకి తెచ్చారు..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
రాములక్క ఫేస్‌బుక్ పోస్ట్ యాథావిథిగా...
"తన భూములకు సంబంధించిన రికార్డులను తారుమారు చేశారని రెవిన్యూ అధికారుల తీరుపై రైతు శరత్... ఫేస్ బుక్ ద్వారా చేసిన ఫిర్యాదుపై స్పందించి, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోమని తెలంగాణ సీఎం కేసీఆర్ గారు ఆదేశించారు. రైతు శరత్ ఫిర్యాదుపై సీఎం స్పందించడం మంచి పరిణామమే కానీ...కొలంబస్ అమెరికాను కనిపెట్టినట్లు, రెవిన్యూ రికార్డులను తారుమారు చేయడం ఇదే మొదటి సారి అయినట్లు, దాన్ని కేసీఆర్ గారే కనిపెట్టి, చర్యలు తీసుకున్నట్లు నానా యాగీ చేస్తున్నారు. ఈ ఐదేళ్లుగా రెవిన్యూ శాఖకు సంబంధించి ఇలాంటి ఫిర్యాదులు ఏమీ సీఎం దృష్టికి రాలేదా అనే విషయంపై కేసీఆర్ గారు వివరణ ఇవ్వాలి. రెవిన్యూ శాఖను ప్రక్షాళన చేయడం కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా ఆచరణలోకి తీసుకురావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. గతంలో గ్యాంగ్ స్టర్ నయీం వివాదంపై రాద్ధాతం చేసి, టీఆరెస్ ప్రభుత్వం ఆ విషయాన్ని గాలికి వదిలేసింది. హైదరాబాద్ లో డ్రగ్స్ వినియోగంపై రోజుకో సెలబ్రిటీని పిలిచి, విచారణ పేరుతో పెద్ద హడావుడి చేసి, చివరకు ఈ వ్యవహారంపై ఊసెత్తడంలేదు" అని టీఆర్ఎస్ సర్కార్‌పై రాములక్క సూటి ప్రశ్నలు సంధించారు.
కేకే వ్యవహారం..!?
"వీటితో పాటూ మియాపూర్ భూదందాలపై విచారణ జరుపుతామని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం చివరకు బలహీన వర్గాలకు చెందిన కొంతమంది నేతల నుంచి భూములను లాక్కుని తమ ప్రతాపాన్ని ప్రదర్శించింది. ఇప్పడు ఈ తరహాలోనే రెవిన్యూ శాఖ ప్రక్షాళన అంశం కూడా ప్రచార ఆర్భాటంగా మిగిలిపోతుందేమో అన్న అనుమానం కలుగుతోంది. కేసీఆర్ గారికి తప్పు చేసిన వారిని బెదిరించడం, వారు లొంగిపోతే తెరవెనుక లాలూచీ పడటం కొత్తేమీ కాదు. రెవిన్యూ శాఖ ప్రక్షళన పేరుతో ఇలాంటి బెదిరింపులు, లాలూచీలు జరుగుతాయేమోనని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు" అని విజయశాంతి చెప్పుకొచ్చారు.
నాగార్జున భూములు ఆక్రమించుకుంటారా..!?
"టీఆరెస్ పార్టీకి చెందిన కె.కేశవరావు గారు మియాపూర్ భూములను కొనడం చెల్లదని, ఆయన నుంచి భూములను లాక్కున్న కేసీఆర్ ప్రభుత్వం.. సినీ హీరో నాగార్జున అక్రమంగా భూములను రెగులరైజ్ చేసుకున్నారన్న ఆరోపణలపై ఎందుకు చర్య తీసుకోలేదని తెలంగాణ ఉద్యమకారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు రెవిన్యూ శాఖ ప్రక్షాళన సందర్భంగానైనా హీరో నాగార్జున అక్రమంగా కొన్న భూములపై చర్యలు ఉంటాయా అని వారు నిలదీస్తున్నారు. ఎందుకంటే గతంలో 2014 ఎన్నికల సందర్భంగా కేసీఆర్ గారు మాట్లాడుతూ హీరో నాగార్జున హైదరాబాద్ శివార్లలోని భూములను అక్రమంగా సొంతం చేసుకున్నారని, టీఆరెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ భూములను మళ్లీ స్వాధీనం చేసుకుంటామని ఇప్పటి సీఎంగారు అప్పట్లో హెచ్చరించారు" అని చెబుతూ ఓ వీడియోను సైతం తన పోస్ట్‌కు ఆమె జతపరిచారు.
నాగార్జునకు అవన్నీ వర్తిస్తాయా..!?
"మరి ఆ హెచ్చరికలు ఏమైనట్లు...రెవిన్యూ చట్ట ఉల్లంఘనలపై చర్యలు కేవలం బలహీన వర్గాల వారికే వర్తిస్తాయా...లేక హీరో నాగార్జున వంటి పలుకుబడి గల సెలబ్రిటీలకు కూడా వర్తిస్తాయా అనే విషయంపై స్పష్టతరావాలి. లేనిపక్షంలో రెవిన్యూ శాఖ ప్రక్షాళన అంశం కూడా కొండను తవ్వి ఎలుకను పట్టే చందంగా మారుతుంది. ఐదేళ్ల క్రితం ఎన్నికల సమయంలో తాను చేసిన కామెంట్స్ ను కేసీఆర్ గారు మరచిపోయి ఉండొచ్చు. అందుకే 2014 ఎన్నికల సందర్భంగా హీరో నాగార్జునను ఉద్దేశించి, కేసీఆర్ గారు ఏ విధంగా విమర్శలు గుప్పించారనే విషయాన్ని తెలిపే వీడియో లింక్ ను ఇక్కడ జతపరుస్తున్నాను" అని రాములమ్మ పోస్ట్ చేశారు. కాగా ఈ మొత్తం వ్యవహారంలో నాగార్జునను మాత్రం విజయశాంతి గట్టిగానే టార్గెట్ చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఈ టైమ్‌లో ఎందుకిలా టార్గెట్ చేశారు..? అసలు నాగ్ నిజంగానే భూములు ఆక్రమించారా..? అనే విషయాలు మాత్రం తెలియరాలేదు.. ఎలాంటి ఆధారాలు కూడా లేవు. అయితే ఈ వ్యవహారంపై మన్మథుడు స్పందిస్తారా..? లేకుంటే ఎవరేమనుకుంటే తనకేం అని మిన్నకుండిపోతారా..? అనేది తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout