ఏపీలో దేవుడికే దిక్కులేదు.. టీటీడీ ఎందుకు స్పందించట్లేదు!
- IndiaGlitz, [Thursday,April 18 2019]
ఆంధ్రప్రదేశ్‌లో దేవుడికే దిక్కు లేదని.. ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన పద్మ టీడీపీ, టీటీడీపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం చెన్నైలో పట్టుబడిన బంగారం ఎవరదని, టీటీడీది అయితే అలా ఎందుకు తరలించాల్సి వచ్చిందని ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ వ్యవహారంపై టీటీడీ ఎందుకు మాట్లాడటం లేదని వాసిరెడ్డి నిలదీశారు. ఇంత జరుగుతున్నా టీటీడీ అధికారులు నోరు మెదపకపోవడం, దీనికి సంబంధించి మాట్లాడేందుకు నిరాకరించడం వెనుక ఆంతర్యమేంటి..? అసలు ఇది దేనికి సూచకం అని పద్మ ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై వెంటనే విచారణ జరిపించి వాస్తవాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇంత పెద్ద ఎత్తున చెన్నైలో తిరుమల బంగారం పట్టుబడితే టీటీడీ ఈవో, చైర్మన్ ఎందుకు స్పందించకపోవడం లేదని నిలదీశారు. అసలు ఇందులో దాగి ఉన్న మతలబు ఏంటి? ముఖ్యమంత్రి అనేక విషయాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు.. కానీ టీటీడీపై మాత్రం ఎందుకు స్పందించట్లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలేం జరిగింది..!?
తిరుమల తిరుపతి దేవస్థానం బంగారం రోడ్లపై పట్టుబడితే.. సెక్యురిటీ లేకుండా, ఎలాంటి ధువీకరణ పత్రాలు లేకుండా టీటీడీ బంగారాన్ని తరలిస్తున్నారంటే దాని అర్థం ఏంటి.? ఒక పవిత్రమైన దేవాలయం బంగారం విషయంలో ఇంత వివాదం జరగాల్సిన అవసరం ఏముంది? భక్తులు భక్తీభావంతో సమర్పించే బంగారానికి లెక్కా పత్రం లేకుండా పట్టుబడితే దానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడం ఏంటి? దీన్ని అనధికారికంగా ఏమైనా తరలిస్తున్నారా? తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజలకు ఉంటుంది. వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి రావాలని మేం కోరుతున్నాం. ఎవరూ కూడా స్పందించకపోవడం బాధ్యతారాహిత్యం అవుతుంది. ఆ బంగారం ఎవరిది? టీటీడీది అయితే ఎందుకు పట్టుబడింది? రెండు రోజులు గడుస్తున్నా ఎవరూ ఎందుకు స్పందించడం లేదు.? టీటీడీ బంగారానికి లెక్కా జమా లేకుండా పోయింది. దేవుడికే దిక్కు లేకపోతే రాష్ట్రంలో ఎవరికి దిక్కుంది. ఈ వ్యవహారం మొత్తం కూడా వెలుగులోకి రావాలని వైసీపీ డిమాండు చేస్తోంది. అన్ని వివరాలను ప్రజల ముందు ఉంచాలి అని వాసిరెడ్డి పద్మ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
కాగా.. ఇటీవలే చంద్రబాబు వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టించుకుండా.. ముఖ్యంగా శాంతి భద్రతలు, ఇష్టానుసారం లెక్కలు తారుమారు చేయకుండా.. చెక్కుల వ్యవహారం వీటన్నింటిపై ఓ కన్నేసి ఉంచాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తన బృందంతో కలిసి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌ను కలిసిన సంగతి తెలిసిందే. మరోవైపు కొందరు నేతలు మే-23 వరకు రాష్ట్రపతి పాలన విధించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే టీటీడీ వ్యవహారంపై ఇంత వరకు చంద్రబాబు గానీ టీటీడీ ఉన్నతాధికారులు, ఈవో, చైర్మన్ స్పందించకపోవడం వెనుక ఏదో మతలబు ఉందనే అనుమానాలు రోజుకో బలపడుతున్నాయి. అయితే ఈ వ్యవహారం ఎందాకా వెళ్తుందో..? ఎక్కడ ఫుల్‌స్టాప్ పడుతుందో వేచి చూడాల్సిందే మరి.