Taraka Ratna:తారకరత్న శరీరం నీలం రంగులోకి మారడం వెనుక.. ఆ 45 నిమిషాలు ఏం జరిగింది..?

  • IndiaGlitz, [Saturday,January 28 2023]

సినీనటుడు నందమూరి తారకరత్న గుండెపోటుకు గురవ్వడంతో టాలీవుడ్ ఉలిక్కిపడింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యాదర్శి నారా లోకేష్ కుప్పంలో నిన్న యువగళం పాదయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి తారకరత్న కూడా హాజరయ్యారు. అభిమానుల తాకిడి, ఎండ ప్రభావం ఎక్కువగా వుండటంతో ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కాసేపు విశ్రాంతి అనంతరం తిరిగి పాదయాత్రకు సిద్ధమవుతూ వుండగా మధ్యాహ్నం 12 గంటలకు ఆయన గుండెపోటుకు గురయ్యారు. దీంతో తారకరత్నను హుటాహుటిన కుప్పం ఆసుపత్రికి తరలించి సీపీఆర్ చేయించారు. ఆ వెంటనే పీఈఎస్ వైద్య కళాశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం తారకరత్నను శుక్రవారం అర్ధరాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు. అంతకుముందు తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి కుప్పం చేరుకున్నారు. ఆమె నిర్ణయం మేరకు బెంగళూరుకు ఆయనను తరలించారు. ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు తారకరత్న సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు బెంగళూరులోని నారాయణ హృదయాలయకు చేరుకోనున్నారు.

నీలం రంగులోకి తారకరత్న శరీరం:

అయితే తారకరత్న శరీరం నీలం రంగులోకి మారడంతో మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. ఇక సోషల్ మీడియా సంగతి సరేసరి. కాగా.. గుండెపోటుకు గురైన తారకరత్నను ఆసుపత్రికి తీసుకొచ్చేసరికి పరిస్ధితి విషమంగా వుంది. పల్స్ రేటు పడిపోవడంతో పాటు శరీరం నీలం రంగులోకి మారిపోయింది. దీంతో కుప్పంలోని పీఎస్ హాస్పిటల్ వైద్యులు తారకరత్నకు సీపీఆర్ చేయడంతో పల్స్ రేటు మెరుగుపడింది. తారకరత్నను ఆసుపత్రికి తీసుకొచ్చిన 45 నిమిషాల సమయం అత్యంత కీలకమైనదిగా వైద్యులు చెబుతున్నారు.

రక్త ప్రసరణకు అవరోధం వల్లే గుండెపోటు :

ఇక శరీరం నీలం రంగులోకి మారడంపైనా కార్డియాలిజస్టులు వివరణ ఇస్తున్నారు. తారకరత్న శరీరంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా వుందన్నారు. అలాగే మానవ శరీరంలో గుండె కొట్టుకోవడం నెమ్మదించినప్పుడు శరీర భాగాలకు రక్త ప్రసరణ తగ్గుతుందని వైద్యులు చెప్పారు. రక్తం చేరని కాలి, చేతి వేళ్లతో పాటు కొన్ని శరీర భాగాలు నీలం రంగులోకి మారతాయని డాక్టర్లు వెల్లడించారు. అలాగే తారకరత్న గుండెలోని ఎడమవైపు భాగంలో 90 శాతం బ్లాక్స్ ఏర్పడ్డాయని.. దీని వల్లే రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడిందని.. అదే గుండెపోటుకు కారణమైందని చెప్పారు