జనసేన అంటే ఎందుకంత భయం.. బాంబులేశారా!
Send us your feedback to audioarticles@vaarta.com
యుద్ధం నీ కోసం చేస్తున్నావా..? ప్రజల కోసం చేస్తున్నావా.? అన్నదాన్ని బట్టే గెలుపు నిర్ణయించబడుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఎవరి కోసం ఫైట్ చేస్తున్నారో ముందు తెలుసుకోవాలన్నారు. కిరాయి మూకలు, ప్రైవేటు సైన్యంతో రాజకీయాలను శాసించవచ్చు అనుకుంటే పొరపాటే అన్నారు. లారీ టైర్లను కాలికి చెప్పులుగా చేసుకుని బహుజన సమాజ్ వాది పార్టీని జాతీయ పార్టీగా నిలబెట్టిన కాన్షీరాం గారే మనకు ఆదర్శమని, ఒకడి బలం, ఒకడి తెగింపే... అందరి బలం, తెగింపు అవుతుందన్నారు. మంగళవారం కర్నూలు నగరంలోని యు.బి.ఆర్ కన్వెన్షన్ హాల్లో కర్నూలు జిల్లా జనసేన కార్యకర్తలతో సమావేశమై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "కర్నూలు జిల్లా అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి మొదటి రాజధాని. ఇప్పటికీ ఇదే రాజధాని అయితే విశ్వనగరంగా రూపాంతరం చెందేది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా రాయలసీమ నుంచి చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు. అయినా రాయలసీమ ఇంకా వెనుకబాటుకు గురికావడం సిగ్గుచేటు. పదవులు అనుభవించిన వ్యక్తులు, కుటుంబాలు బాగుపడ్డాయి తప్ప ప్రజలు బాగుపడలేదు. రాష్ట్రాన్ని ఏ కుటుంబం పాలించినా అన్ని కులాలు, మతాల కోసం పనిచేయాలి అదే ప్రజాస్వామ్యం. సీఎం కేసీఆర్, పరిటాల సునీత లాంటి రాజకీయ ప్రత్యర్ధుల ఇళ్లకు ఎందుకు వెళ్తున్నారని చాలా మంది నన్ను అడుగుతున్నారు. వాళ్లంటే నాకు ఎప్పుడూ వ్యక్తిగత ద్వేషం లేదు. ఒకే రంగంలో ఉన్నప్పుడు వాళ్లతో మాట్లాడాలి. రేపు ఏదైన సమస్య వస్తే వాళ్లను అడిగేవాడు కావాలి. సయోధ్యతోనే సమస్యకు పరిష్కారం రావాలని ఎక్కువ కోరుకుంటాను. సయోధ్యతో కుదరని పక్షంలోనే యుద్ధం చేస్తాను. యుద్ధం అంటూ మొదలు పెడితే నా తలైన తెగాలి లేదా ఎదుటి వాడి తలైనా తెగాలి. నన్ను నమ్మి ఇంత మంది జనసైనికులు వచ్చారు. నేను ఏదో మాట్లాడి వెళ్లిపోతే మీ మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెడతారు. నాయకుడి తొలి ప్రాధాన్యం ఎప్పుడు తనను నమ్మిన వారిని రక్షించుకోవడమే" అని పవన్ చెప్పుకొచ్చారు.
యుద్ధం చేయాలి..
"జనసేన పార్టీకి ఓట్లు లేవు, 10 మంది కుర్రాళ్లు చేసే గోల తప్ప అక్కడ ఏమీ లేదు అంటున్నారు. అంతమాత్రానికి మమ్మల్ని చూసి భయపడటం ఎందుకు..?. 2009 ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదు. అలాంటి పార్టీ 2014లో అదే నియోజకవర్గాల్లో భారీ మెజార్టీతో ఎలా గెలిచింది..? మేము మా జనసైనికులు అంతా కలిపి 12.5 శాతం ఓట్లు పూడిస్తే మీరు రెండు శాతం ఓట్లతో బయటపడ్డారన్న విషయం గుర్తించుకోవాలి. ఆవేశంతో కాదు ఆలోచనతో యుద్ధం చేయాలి" అని పవన్ పిలుపునిచ్చారు.
ఎందుకంత భయం.. బాంబులేస్తున్నారా..!?
2014లో ఏమీ ఆశించకుండా తెలుగుదేశం పార్టీకి కొమ్ముకాసి గెలిపించాం. ఇవాళ కర్నూలు జిల్లాలో ఏ మూలకు వెళ్లిన జనసైనికులపై బైండోవర్ కేసులు పెడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు, డీజీపీని అడుగుతున్నా మా వాళ్లు ఏమైన సంఘవిద్రోహ శక్తులా..? బాంబులు వేశారా..? లేక వేటకొడవళ్లతో ఎవరినైనా నరికారా..?. మహా అయితే వేటకొడవళ్లతో నరికే వారికి ఎదురొడ్డిపోరాడారు. మీరు మహా అయితే వెయ్యిమంది ఉంటారు. మేము పదిలక్షల మంది ఉన్నాం. ఎంత మంది మీద కేసులు పెడతారు, ఎంతమందిపై దాడులు చేస్తారు. తెలుగుదేశం గెలుపుకు మనమంతా కృషి చేస్తే వాళ్లు మాత్రం పలాస, ఏలూరులో మనపై దాడులు చేయించారు. ఒక ఎమ్మెల్యే చేసిన ఆగడాలు ప్రశ్నిస్తే.. సెక్యూరిటీ సిబ్బందిపై కత్తులతో దాడులు చేశారు. నాదెండ్ల మనోహర్ గారి కారును లారీతో ఢీకొట్టారు. దీనిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. అంతా గుర్తుంచుకుంటున్నాం మరిచిపోలేదు. మానవత్వం నిలబెట్టడానికి రాజకీయాలు చేయడానికి వచ్చాను. మీరంతా భగవంతుడిని మించిన వ్యక్తులు కాదని గుర్తుంచుకోవాలి" అని పవన్ చెప్పుకొచ్చారు.
ఆ మాటకొస్తే నేను చచ్చిపోతాను..
"పికిరితనంతో పారిపోతావా..? ధైర్యంతో చచ్చిపోతావా..? అని అడిగితే నేను ధైర్యంతో చచ్చిపోతానంటాను. మీరు కూడా ధైర్యంగా ఉండండి, బలంగా ఎదుర్కొండి. యుద్ధంలో చచ్చిపోయే పరిస్థితే వస్తే గెలిచి చచ్చిపోవాలి తప్ప ఓడి చచ్చిపోకూడదు. ఒకడి ఆత్మత్యాగం, బలిదానం ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలి తప్ప , చంపేయకూడదు. తెలివి, తెగింపుతో యుద్ధం చేయండి. మాటనే ఖడ్గంతో చెడును చంపేద్దాం. అధర్మాన్ని తీసేద్దాం, ధర్మాన్ని నిలబెడతాం. జనసేన పార్టీ అధికారంలోకి రాగానే అమరావతి నగరంతో సమాంతరంగా కర్నూలు నగరాన్ని అభివృద్ధి చేస్తాం. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాము"అని పవన్ హామీ ఇచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com