CI Anju Yadav:మహిళలు తిరగబడాలంటాడు .. మనమీదకొస్తే తట్టుకోలేడు, లేడీ సింగంపై పవన్‌కు ఎందుకింత కక్ష.. "బీసీ" అనేనా..?
Send us your feedback to audioarticles@vaarta.com
అంజూ యాదవ్.. గత కొన్నిరోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆమె పేరు మారుమోగుతోంది. ఆమె సెలబ్రిటీ కాదు, రాజకీయ నాయకురాలు అంతకన్నా కాదు. ఓ మామూలు సీఐ. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి స్టేషన్‌కు ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు అంజూ యాదవ్. వాలంటరీ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు , వాలంటీర్లు దగ్థం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాలపై జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిలోని పెళ్లిమండపం వద్ద బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేసేందుకు జనసేన శ్రేణులు యత్నించాయి. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు సీఎం దిష్టిబొమ్మను లాక్కొనే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో జనసేన నేత కొట్టే సాయిపై శ్రీకాళహస్తి వన్‌టౌన్ సీఐ అంజూ యాదవ్ చేయి చేసుకున్నారు. అతని రెండు చెంపలపైనా కొట్టారు. అక్కడే వున్న జనసేన కార్యకర్తలు ఈ తతంగాన్ని వీడియో తీసి ఇంటర్నెట్లో పెట్టడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దూకుడైన తీరుతో వివాదాల్లోకి అంజూ యాదవ్ :
అయితే సీఐ అంజూ యాదవ్ తీరు తొలి నుంచి వివాదాస్పదంగా వుంది. గతంలో నిర్దేశించిన సమయానికి హోటల్ మూయలేదంటూ ఓ మహిళపై అంజూ యాదవ్ చేయి చేసుకోవడంతో ఏకంగా జాతీయ మహిళా కమీషన్ సీరియస్ అయ్యింది. తక్షణం సీఐపై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. ఈ ఘటనపై టీడీపీ నేత వంగలపూడి అనిత సైతం మహిళా కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. గతంలో పలుమార్లు తన దూకుడైన వైఖరితో ఏరి కోరి వివాదాల్లో చిక్కుకున్నారు అంజూ యాదవ్. పై అధికారుల నుంచి మెమోలు, ప్రజలు, ప్రజా సంఘాల నుంచి విమర్శలను ఎదుర్కొన్నారు. అయినా అంజూ యాదవ్ తీరులో కాస్త కూడా మార్పు రాలేదు.
జాతీయ స్థాయిలో మారుమోగుతోన్న అంజూ యాదవ్ పేరు :
కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎంట్రీతో అంజూ యాదవ్ జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యారు. తమ కార్యకర్తను కొట్టిన ఆమెను వదిలేది లేదని, తిరుపతిలోనే తేల్చుకుంటానంటూ తేల్చిచెప్పిన ఆయన అన్నట్లుగానే సోమవారం భారీ ర్యాలీగా వెళ్లి ఎస్పీకి ఫిర్యాదు చేశారు . అంజూ యాదవ్ మీద చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ వినతి పత్రం సమర్పించారు. ఎంత సీఐ అయినా చేయి చేసుకోవడం తప్పే. దీనిని ఎవరూ కాదనరు. కానీ అందుకు దారి తీసిన పరిస్ధితులు.. అంతమంది జనసేన కార్యకర్తలు చుట్టూ వుండగా సాయి అనే వ్యక్తినే అంజూ యాదవ్ ఎందుకు కొట్టారు అనేది మాత్రం ఆలోచించడం లేదు.
లాఠీఛార్జ్ చేసే పరిస్ధితిని చెంప దెబ్బతో అదుపు :
సీఎం వైఎస్ జగన్ దిష్టిబొమ్మను దగ్థం చేసేందుకు జనసేన నేతలు యత్నించారు. అంతేకాదు.. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ తలపై కాళ్లు వేసి తొక్కారు. ఈ తరుణంలో అంజూ యాదవ్, ఇతర పోలీస్ సిబ్బంది వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. జనసేన కార్యకర్తలు నియంత్రణ కోల్పోయి పోలీసుల మీదకే దాడి చేసే పరిస్థితి నెలకొంది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అదుపు చేసే క్రమంలో ఆమె ఒక చెంపదెబ్బ కొట్టారు. నిజానికి అప్పుడున్న పరిస్ధితుల్లో లాఠీఛార్జ్ చేస్తే కానీ.. అక్కడ ప్రశాంత నెలకొనలేదు. కానీ సామరస్యంగా పరిస్థితిని అదుపు చేసే క్రమంలో అంజూ యాదవ్ ఒక చెంప దెబ్బ కొట్టారు.
బీసీ మహిళ అయినందునే ఈ రాజకీయ దాడి :
అయితే బీసీ వర్గానికి చెందిన మహిళా పోలీస్ అధికారి ఇలా తమ మీద అధికారం చూపడాన్ని సహించలేని పవన్ కళ్యాణ్, ఆయన వర్గీయులు ఇలా ఆమె మీద రాజకీయ దాడి చేస్తున్నారని యాదవ వర్గాలు భగ్గుమంటున్నాయి. స్ట్రిక్ట్ ఆఫీసర్ అనే పేరున్న అంజూ యాదవ్ కేవలం బీసీ మహిళ అనే కారణంతో చిన్న చూపు చూస్తూ అవమానించడాన్ని ఆ వర్గం ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ ఆడబిడ్డ ఎదుగుదలను సహించలేని పెత్తందారీ పోకడలున్న పవన్ కళ్యాణ్ ఆమెపై ఈ విధంగా ప్రతీకారం తీర్చుకుంటున్నారని యాదవ సంఘాలు మండిపడుతున్నాయి. బీసీ వర్గానికి చెందిన అంజూ యాదవ్ జోలికొస్తే తాట తీస్తామని పవన్‌ను హెచ్చరిస్తున్నారు యాదవ నేతలు. మాట్లాడితే కానిస్టేబుల్ కొడుకునని చెప్పుకునే పవన్ .. జీవితంలో ఎంతో కష్టపడి సీఐ స్థాయికి ఎదిగిన అంజూ యాదవ్ పట్ల ఈ విధంగా వ్యవహరించడం సరికాదని అంటున్నారు. అంజూ ఏ తప్పు చేయలేదని.. రోడ్డుపై ధర్నా చేయడం వల్ల పబ్లిక్కు ఇబ్బంది కలగకుండా చేసేందుకు తన విధిని తాను నిర్వర్తించారని యాదవ సంఘాలు అంటున్నాయి.
అధికార పార్టీ అయినా, విపక్ష పార్టీ అయినా ట్రీట్మెంట్ ఒక్కటే :
నిజానికి అంజూ యాదవ్ దూకుడుగా వుంటారన్న పేరే గానీ.. ఆమె నిజాయితీ గల అధికారి అని పోలీస్ శాఖలో వినిపించే మాట. తప్పు చేస్తే సామాన్యుడైనా , సెలబ్రిటీ అయినా ఆమె ట్రీట్మెంట్ ఒకేలా వుంటుంది. అధికార పార్టీయా, ప్రతిపక్షమా అన్న తేడా కూడా అంజూ యాదవ్ చూపించరు. ఏడాది క్రితం వైసీపీ నేత, స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర ఓ ధర్నాలో పాల్గొనగా ఆమెను సైతం ఇలాగే దండించి శాంతి భద్రతలు కాపాడారు అంజూ యాదవ్. అక్కడ ధర్నా చేస్తోంది స్వయంగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కూతురు. ఏ మాత్రం తేడా వచ్చినా కెరీర్‌పై ఎఫెక్ట్ పడుతుంది. కానీ ఆమె అవేవీ ఆలోచించలేదు. పబ్లిక్ సేఫ్టీ, శాంతి భద్రతలు, విధి నిర్వహణ ఆవిడకు కావాల్సింది ఇదే. తప్పు చేస్తే శిక్ష పడాలన్నదే ఆమె సూత్రం. అందుకే అంజూ యాదవ్ డ్యూటీలో ఎంత క్రమశిక్షణలో ఉంటారో తప్పు చేసినవాళ్లు విషయంలో అంతే కఠినంగా ఉంటారని ఆ ప్రాంతంలో పేరుంది.
మాటలకే పవన్ సిద్ధాంతాలు :
తప్పు చేస్తే ఎవరినైనా నిలదీయాలని ఊగిపోతూ చెప్పే పవన్ కళ్యాణ్‌కు మరి అంజూ యాదవ్ చేస్తున్న దానిలో తప్పేముందో అర్ధం కావడం లేదు. ఆయన సిద్ధాంతాలకు దగ్గరగానే ఆమె పనిచేస్తున్నారు. అలాంటప్పుడు అభినందించాల్సింది పోయి.. చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేస్తారా. తన వాళ్ల జోలికి వస్తే.. సిద్ధాంతాలు, భావజాలాలు పక్కనపెట్టేయడమేనా. ఒక రాజకీయ నాయకుడిగా ప్రజలకు , కేడర్‌కు చెప్పాల్సింది, ఆచరించాల్సింది ఇదేనా అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తన పార్టీ మనిషిని కొట్టాడని.. అది కూడా ఓ బీసీ మహిళా అధికారిణి అనే విషయాన్ని పవన్ జీర్ణించుకోలేకుండా వున్నాడు. తద్వారా అగ్ర కుల దురహంకారాన్ని చూపిస్తున్నాడంటూ యాదవ సంఘాలు మండిపడుతున్నాయి. టైం చూసి పవన్ కల్యాణ్‌కు తమ తడాఖా చూపిస్తామని హెచ్చరిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout