హన్సిక అలా అనేసిందేంటబ్బా...
- IndiaGlitz, [Wednesday,July 12 2017]
పదహారేళ్ళకే హీరోయిన్‌గా నటించింది. హీరోతో కలిసి స్టెప్పులేసింది. ఆమె హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పటికి పదేళ్ళు పూర్తయ్యాయి. ఆమె గ్లామర్ ప్రపంచానికే పరిమితం కాదు. అనాథలకు ఆపన్న హస్తం అందిస్తుంది. పెళ్ళి కాకుండానే 31 మంది పిల్లలకు తల్లయింది. అమ్మ చెప్పిన మాటలు ఆదర్శంగా తీసుకుంది. అనాథ పిల్లలను దత్తత తీసుకొని వారిని తల్లిలా చేయూత నిస్తోంది. ఆమె పేరు హన్సిక. తెలుగులో 'దేశముదురు' చిత్రంతో తెరంగేట్రం చేసిన హన్సికకు ఈమధ్య తెలుగులో అవకాశాలు తగ్గాయి.
తమిళ ఇండస్ట్రీపైనే ఎక్కువ దృష్టిపెట్టింది. ఎక్కువగా యంగ్ హీరోలతోనే సినిమాలు చేసిన హన్సికను స్టార్ హీరోలతో నటించే ఉద్దేశం లేదా? అని అడిగిన ప్రశ్నకు 'నా దృష్టిలో అందరూ ఒక్కటే. చిన్నవారు, పెద్ద వారు అనే తేడా నాకు లేదు. ఎవరైనా చిన్న స్థాయి నుంచి పైకి రావాల్సిందే తప్ప ఒక్కసారిగా స్టార్ హోదా రాదు. అయినా ఈ హోదా, నంబర్లపైన నాకు నమ్మకం లేదు. సక్సెస్‌లు వున్నంత వరకు నంబర్లు కనిపిస్తాయి. ఒక్క ఫ్లాప్ వచ్చిందంటే ఆ నంబర్ల స్థానంలో నక్షత్రాలు కనిపిస్తాయి. నాకు నా కెరీర్ ముఖ్యం తప్ప ఫలానా వయసు వాళ్ళతోనే నటించాలని గిరి గీసుకోలేదు. నాకు కథ నచ్చితే ఏ హీరోతో నటించడానికైనా సిద్ధమే అంటోంది హన్సిక మోత్వాని.