TDP, Pawan:40 ఇయర్స్ టీడీపీకి పవన్ కల్యాణే పెద్ద దిక్కు ఎందుకు అయ్యారు..?
Send us your feedback to audioarticles@vaarta.com
నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న పార్టీ.. సినిమాలతో పాటు రాజకీయాలను శాసించిన దివంగత సీఎం ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ.. దాదాపు 20 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ.. ఎంతో మంది నాయకులను తీర్చిదిద్దిన పార్టీ.. అలాంటి పార్టీ కష్టాల్లో ఉంటే నాయకత్వం వహించే వారు కరువయ్యారు. తెలుగునాట మొట్టమొదటి ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీకి ఘనమైన చరిత్ర ఉంది. అన్న నందమూరి తారకరామారావు 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించింది.
ఇప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీకి మైనస్..
తర్వాత పార్టీలో చీలిక వచ్చి అధికారం కోల్పోయింది. 1995లో పార్టీ పగ్గాలు ఎన్టీఆర్ చేతి నుంచి ఆయన అల్లుడు చంద్రబాబు చేతికి వెళ్లాయి. అప్పటి నుంచి టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు కొనసాగుతూ వస్తున్నారు. ఉమ్మడి ఏపీలో 9 సంవత్సరాలు, నవ్యాంధ్రలో 5 సంవత్సరాలు పాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా పార్టీని అంతా తానై నడిపించారు. నందమూరి కుటుంబసభ్యులను పార్టీకి దూరంగా ఉంచారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఇదే టీడీపీకి మైనస్ అవుతుంది.
పార్టీ బాధ్యతలు తీసుకోని బాలకృష్ణ, హరికృష్ణ..
స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు కావడంతో ఇప్పుడు ఆ పార్టీకి నాయకత్వం వహించే వారు లేకుండా పోయారు. దీంతో క్యాడర్ గందరగోళంలో ఉంది. ఏ ప్రాంతీయ పార్టీకైనా బలమైన నాయకులు చాలా అవసరం. అలాంటి నాయకుడు ఉన్నప్పుడే ఆ పార్టీ ముందుకు సాగుతుంది. కానీ టీడీపీలో చంద్రబాబు తర్వాత అలాంటి బలమైన నాయకుడు మరొకరు లేరు. ఎన్టీఆర్ వారసుడు నందమూరి బాలకృష్ణ, దివంగత హరికృష్ణ రాజకీయాల్లోకి వచ్చినా కేవలం ఎమ్మెల్యే, ఎంపీలుగా మాత్రమే మిగిలిపోయారు. ఏనాడు పార్టీ బాధ్యతలు అందిపుచ్చుకోలేదు.
టీడీపీకి పెద్ద దిక్కుగా మారిన పవన్ కల్యాణ్..
ఇక చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ కూడా రాజకీయాల్లో ఇంకా ఆరితేరలేదు. యువగళం పాదయాత్రతో బలం పుంజుకునే క్రమంలో ఉండగానే చంద్రబాబు అరెస్టు కావడం.. వెను వెంటనే తనను ఎక్కడ అరెస్టు చేస్తారో అనే సందేహంతో ఢిల్లీ వెళ్లడంతో కార్యకర్తలను నడిపే నాయకుడు లేకుండా పోయారు. ఈ తరుణంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పుడు టీడీపీకి నాయకుడిగా మారిపోయారనే విమర్శలు బలంగా వస్తున్నాయి. రాజమండ్రి జైలులో చంద్రబాబుతో ములాఖత్ అయిన సందర్భంలో టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తామని ప్రకటించిన దగ్గరి నుంచి తెలుగుదేశం పార్టీకి పవనే పెద్ద దిక్కుయ్యారు. ఇది ఇటు జనసేన.. అటు టీడీపీలోని కొంతమంది కార్యకర్తలకు నచ్చడం లేదు. ఎందుకంటే తమ నాయకుడు టీడీపీకి నాయకత్వం వహించడం ఏంటని జనసైనికులు.. తమ వారసుడు జూనియర్ ఎన్టీఆర్ కాకుండా పవన్ తమను నడిపించడం ఏంటని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు.
లోకేశ్ కోసం ఎన్టీఆర్‌ను పక్కన బెట్టారనే ఆరోపణలు..
జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు అనేది ఎవరు కాదనలేని సత్యం. 2009 ఎన్నికల సమయంలో పార్టీ కోసం ప్రాణాలకు తెగించి మరి ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయినా మహానాడుతో పాటు పార్టీ కార్యక్రమాల్లో తారక్ పాల్గొనేవారు. అదే సమయంలో ఆయనతో సన్నిహితంగా ఉండే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వైసీపీలోకి వెళ్లినప్పుడు తారక్ మీడియాతో మాట్లాడుతూ నా కట్టె కాలే వరకు తెలుగుదేశం కార్యకర్తగానే ఉంటానని ప్రకటించారు. అలాంటి ఎన్టీఆర్ 2014 ఎన్నికల నుంచి పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. తన కుమారుడు లోకేశ్ రాజకీయ భవిష్యత్ కోసం ఎన్టీఆర్‌ను చంద్రబాబు పక్కన పెట్టారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కారణం ఏంటనేది తెలియదు కానీ తారక్ మాత్రం టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు.
చంద్రబాబు స్వయంకృపరాధం వల్లే ఎన్టీఆర్ దూరం..
నా కట్టె కాలే వరకు టీడీపీలోనే ఉంటానన్న తారక్.. ఇప్పుడు అదే పార్టీ అధినేత చంద్రబాబు జైలులో ఉంటే ఇంతవరకు స్పందించలేదు కనీసం పరామర్శించలేదు. దీంతో నారా కుటుంబంతో తారక్‌కు విభేదాలు ఉన్నాయనే వార్తలు జోరందుకున్నాయి. చంద్రబాబు స్వయంకృపరాధం వల్లే ఆపద సమయంలో ఇప్పుడు ఎన్టీఆర్ దూరంగా ఉన్నారని ఓ వర్గం నేతలు వాదిస్తున్నారు. ప్రజల్లో హీరోగా, దివంగత ఎన్టీఆర్ మనవడిగా బలమైన ఇమేజ్ ఉన్న తారక్ పార్టీకి దూరం చేసుకున్నారని చెబుతున్నారు. ఇప్పుడు కష్ట కాలంలో ఉన్నప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అండగా నిలబడాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారని విమర్శిస్తున్నారు.
గతంలో సినిమా స్టార్లు అవసరం లేదని లోకేశ్ పవన్‌పై విమర్శలు..
ఇదే కాకుండా 2014 ఎన్నికల్లో టీడీపీతో కలిసి పనిచేసిన పవన్ కల్యాణ్.. 2018లో ఆ పార్టీతో పొత్తు నుంచి బయటకు వచ్చేశారు. అంతేకాకుండా గుంటూరులో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో లోకేశ్‌పై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. అలాగే లోకేశ్ కూడా పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. మాకు సినిమా స్టార్ల అవసరం లేదని సెటైర్లు వేశారు. కట్ చేస్తే ఇప్పుడు అదే పవన్ కల్యాణ్ పెద్దన్నగా తనకు అండగా ఉన్నారని లోకేశ్ వ్యాఖ్యానించారు. తనపై లక్ష కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు చేసిన పవన్‌తో మళ్లీ కలిసి పోటీ చేస్తున్నారు. ఇదంతా చూసిన జనాలు సొంత కుటుంబసభ్యుడి అయిన జూనియర్‌ని దూరం చేసుకుని ఇప్పుడు పవన్ కల్యాణ్ వెంట పడుతున్నారని అనుకుంటున్నారు. 40 సంవత్సరాల అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీకి పవన్ కల్యాణే ఇప్పుడు పెద్ద దిక్కు అవ్వడం ఆ పార్టీ పరిస్థితిని తెలియజేస్తుందని చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com