ఆ ట్వీట్‌ని బ్రహ్మాజీ ఎందుకు డిలీట్ చేశారు?

  • IndiaGlitz, [Monday,October 19 2020]

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే నటుల్లో బ్రహ్మాజీ ఒకరు. అభిమానుల ప్రశ్నలకు ఫన్నీ ఫన్నీగా సమాధానాలు ఇస్తూ అభిమానులకు చాలా దగ్గరగా ఉంటారు. తోటి నటీనటులు ఏమైనా పోస్టులు పెట్టినా సరే చాలా సరదాగా స్పందిస్తారు. చాలా సీరియస్ విషయాన్ని చాలా ఫన్నీగా చెప్పి అభిమానుల్లో మరోమారు మంచి జోష్ నింపారు. అసలు విషయంలోకి వెళితే తాజాగా నగరంలో కురుస్తున్న బీభత్సమైన వర్షాలకు ఆయన ఇంట్లోకి కూడా నీళ్లొచ్చాయి. నిజానికి అది చాలా సీరియస్ విషయం కానీ బ్రహ్మాజీ దానిని కూడా కామెడీ చేసేశారు.

తన ఇంట్లోకి నీళ్లు వచ్చిన పిక్స్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన బ్రహ్మాజీ.. ‘మోటార్ బోటు కొనాలనుకుంటున్నా.. ఏది కొనాలో సలహా ఇవ్వండి’ అని ట్వీట్ చేశారు. దీనిని చూసిన నెటిజన్లు ఆగుతారా? ఓ రేంజ్‌లో ఆయన ట్వీట్‌కు స్పందన వచ్చింది. నెటిజన్లు సైతం చాలా ఫన్నీగా స్పందించారు. కానీ ఆ ట్వీట్‌ను బ్రహ్మాజీ ఎందుకో గాని డిలీట్ చేశారు. కారణమేంటో తెలియట్లేదు. కాగా.. ప్రస్తుతం బ్రహ్మాజీ.. ‘అల్లుడు అదుర్స్’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రకాష్‌రాజ్, సోనూసూద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ షూటింగ్ సందర్భంగా బ్రహ్మాజీ, సోనూసూద్ తీసుకున్న ఫన్నీ పిక్స్ ఇరువురి అభిమానులనూ ఆకట్టుకుంటున్నాయి.