చిత్తూరు మృతుల కుటుంబాలకు ఎవరెవరు ఆర్థిక సాయం ప్రకటించారంటే..

  • IndiaGlitz, [Wednesday,September 02 2020]

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం దగ్గర పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా బ్యానర్ కడుతూ విద్యుదాఘాతానికి గురై ముగ్గురు అభిమానులు మృతి చెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న పవన్‌తో పాటు మెగా ఫ్యామిలీ, ‘వకీల్ సాబ్’ టీం, పవన్ 27వ చిత్రానికి సంబంధించిన టీం కూడా ఆవేదన చెందుతోంది. దీంతో మృతుల కుటుంబాలకు ఏర్పడిన లోటును తీర్చలేకున్నా.. ఆ కుటుంబాలకు తమ వంతు ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చారు.

పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడకకు సన్నాహాలు చేస్తూ సోమశేఖర్, రాజేంద్ర, అరుణాచలం అనే ముగ్గురు జనసైనికులు మృతి చెందారు. వీరి మృతి విషయమై తాజాగా మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ‘వకీల్ సాబ్’ టీం, పవన్ 27వ చిత్రాన్ని నిర్మిస్తున్న ‘మెగా సూర్య ప్రొడక్షన్స్’ స్పందించింది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మృతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.2లక్షల ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు రాగా.. అల్లు అర్జున్ రూ.2 లక్షలు, రామ్ చరణ్ రూ.2.5 లక్షలు, ‘వకీల్ సాబ్’ టీం రూ.2 లక్షలు, ‘మెగా సూర్య ప్రొడక్షన్స్’ రూ.2 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చాయి.

కాగా.. ఈ ఘటనపై మెగాస్టార్ చిరంజీవి కూడా కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. అభిమానులు ప్రాణప్రదంగా ప్రేమిస్తారని తెలుసని.. కానీ వారి ప్రాణం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని చిరంజీవి సూచించారు. ‘‘చిత్తూరులో పవన్ బర్త్‌డేకి బ్యానర్ కడుతూ విద్యుత్ షాక్‌తో ముగ్గురు మరణించటం గుండెను  కలిచివేసింది. వారి కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి. అభిమానులు ప్రాణప్రదంగా ప్రేమిస్తారని తెలుసు. కానీ మీ ప్రాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబానికి మీరే సర్వస్వo..’’ అని చిరు ట్వీట్‌లో పేర్కొన్నారు.