Tirupati:ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో గెలుపెవరిది..? స్వామి ఆశీస్సులు దక్కేది ఎవరికి..?
- IndiaGlitz, [Tuesday,March 26 2024]
ఏపీలో ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో రాజకీయాలు వేడెక్కాయి. పోటాపోటీ ప్రచారాలతో హెరెత్తిస్తున్నారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక నగరం, సాక్షాత్తూ ఆ ఏడుకొండల వాడు కొలువైన పుణ్యక్షేత్రం తిరుపతి నియోజకవర్గం మాత్రం ఎప్పుడూ హాట్‌టాపిక్‌గా ఉంటుంది. ఎందుకంటే హిందూవులు పవిత్రంగా భావించే తిరుమల క్షేత్రం ఈ నియోజకవర్గంలోనే ఉంది. అందుకే ఇక్కడి ఎమ్మెల్యేగా గెలిచిన నాయకులకు ఆ స్వామి ఆశీస్సులు ఉంటాయని నమ్మకం. అంతేకాకుండా దేశవ్యాప్తంగా తిరుపతి ఎమ్మెల్యే అంటే మంచి గుర్తింపు ఉంటుంది.
ప్రతి ఎన్నికలు లాగే ఈ ఎన్నికలు కూడా హాట్‌గా మారాయి ఈసారి వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు అభినయ్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీకి దిగారు. తండ్రి వారస్వతంతో మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా గెలిచి డిప్యూటీ మేయర్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. నగరాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ రోడ్లు వేస్తూ తిరుపతి రూపురేఖలు మార్చారు. అలాగే దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న నిషేధిత స్థలాల సమస్యను పరిష్కరించారు. ఇలా తనదైన పాలనతో తిరుపతి ప్రజల్లో యువనాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
అందుకే సీఎం జగన్ కూడా అభినయ్‌కి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. దీంతో కొన్నిరోజులుగా ప్రచారం ముమ్మరం చేశారు. ఎన్నిలప్పుడు మాత్రమే ఎక్కడి నుంచో వచ్చే నాయకులకు ఎందుకు ఓటేయాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. స్థానికుడిగా తిరుపతిలో తాను చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఊరు మారింది.. తరం మారింది.. యువత అభివృద్ధి కోరుకుంటున్నారని.. తనకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే తిరుపతిని రాష్ట్రంలోనే నెంబర్ వన్ సిటీగా అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నారు.
ఓవైపు వైసీపీ అభ్యర్థి అభినయ్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతుంటే.. ప్రతిపక్ష కూటమి మాత్రం చాలా ఆలస్యంగా అభ్యర్థిని ఖరారుచేసింది. ముందుగా ఇక్కడి నుంచి టీడీపీ నేతలు పోటీ చేయాలని భావించగా..పొత్తులో భాగంగా జనసేనకు టికెట్ వెళ్లింది. దీంతో జనసేన అభ్యర్థిగా చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పేరును ఖరారుచేశారు. గత ఎన్నికల్లో చిత్తూరు నుంచి వైసీపీ తరపున గెలిచిన శ్రీనివాసులకు ఈసారి టికెట్ నిరాకరించడంతో ఆయన వైసీపీని వీడి జనసేన కండువా కప్పుకున్నారు. అయితే రాయలసీమలో బలమైన కాపు సామాజికవర్గ వర్గానికి చెందిన నేత కావడంతో పవన్ కల్యాణ్ ఆయనకే టికెట్ కేటాయించారు.
అయితే ఆరణి శ్రీనివాసులు అభ్యర్థిత్వంపై స్థానిక టీడీపీ, జనసేన నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్థానికేతురుడికి టికెట్ ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అయితే ఏకంగా మీడియా ఎదుట కంటతడి పెట్టుకున్నారు. అభ్యర్థి విషయంలో మరోసారి పునరాలోచించాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను విజ్ఞప్తి చేశారు. అయితే వారు మాత్రం శ్రీనివాసుల వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆరణి శ్రీనివాసులకు టీడీపీ, జనసేన నేతలు ఎలా మద్దతు ఇస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఆయన మాత్రం ఇరు పార్టీల నేతలను కలుపుకుని వెళ్తానని.. ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుని గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని స్ఫష్టంచేస్తున్నారు. గత ఐదేళ్లలో అక్రమాలకు పాల్పడిన వైసీపీని ఓడిస్తానని చెబుతున్నారు. ముఖ్యంగా తిరుపతి నియోజకవర్గంలో బలిజ సామాజికవర్గం ఎక్కువగా ఉండటంతో గెలుపుపై నమ్మకంతో ఉన్నారు. బలిజలు ఎక్కువగా ఉండటం జనసేనకు అడ్వాంటేజ్‌గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఎందుకంటే 2009 ఎన్నికల్లో తిరుపతి నుంచి ప్రజారాజ్యం తరపున మెగాస్టార్ చిరంజీవి ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ సెంటిమెంట్ ప్రకారమే ఈసారి జనసేన జెండా కూడా తిరుపతిలో ఎగరడం ఖాయమనే ధీమాతో ఉన్నారు. మెజార్టీ బలిజ ఓట్లతో పాటు పవన్ కల్యాణ్ ఫ్యాక్టర్ కూడా పనిచేస్తుందని భావిస్తున్నారు.
మొత్తానికి ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో రాజకీయం రసవత్తరంగా నడుస్తోంది. బలిజలు ఎక్కువగా ఉండే తిరుపతిలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన భూమన అభినయ్ రెడ్డి గెలుస్తారో..? లేదంటే బలిజ నేత అయిన ఆరణి శ్రీనివాసులు గెలుస్తారో..? చూడాలి. అలాగే భూమన కుటుంబ బలంతో పాటు అభివృద్ధి చేసిన అభినయ్ వైపు ప్రజలు మొగ్గు చూపుతారో..? పవన్ కల్యాణ్ ఇమేజ్ చూసుకుని తమ కులస్తుడైన జనసేన అభ్యర్థిని గెలిపిస్తారో తెలియాలంటే జూన్ 4వరకు ఆగాల్సిందే.