మోహన్‌బాబుకు ఫోన్ చేసి బెదిరించిందెవరు!?

  • IndiaGlitz, [Wednesday,April 03 2019]

సీనియర్‌ నటుడు, నిర్మాత మంచు మోహన్‌బాబు ఇటీవల వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన విషయం విదితమే. ఆయన పార్టీలో చేరిన నాటి నుంచి అటు అధికార పార్టీ.. ఇటు జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు అది కాస్త శృతి మించి.. వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేశారు. ఇదంతా ఆయన పార్టీలో చేరి.. రెండ్రోజుల పాటు ప్రచార వ్యవహారాలు చేసిన తర్వాత జరిగింది.

బెదిరింపు కాల్స్..

కొందరు వ్యక్తుల నుంచి మోహన్ బాబుకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెబుతున్నారు. గత నెల నుంచి ఇలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయనే వెల్లడించారు. ఈ విషయమై బంజారా హిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. అజ్ఞాత వ్యక్తులు గత నెల 26న పలు నెంబర్ల నుండి ఫోన్‌ కాల్స్‌ వచ్చినట్టుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ప్రాథమిక విచారణ అనంతరం ఆ కాల్స్‌ విదేశాల నుంచి వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. విచారణ నిమిత్తం న్యాయ సలహా కోసం సంప్రదింపులు జరుపుతున్నట్టుగా పోలీసులు వివరించారు. కాగా త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే మీడియాకు వెల్లడిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే ఇటీవలే కలెక్షన్ కింగ్‌‌పై చెక్‌బౌన్స్‌ కేసులో ఏడాది జైలుశిక్షను కోర్టు విధించగా బెయిల్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.