ధారావిపై డబ్ల్యూహెచ్‌వో ప్రశంసలు..

  • IndiaGlitz, [Saturday,July 11 2020]

కరోనా వైరస్ ఇండియాలో అప్పుడప్పుడే ప్రారంభమవుతున్న సమయంలో అందరి చూపు ధారావిపైనే పడింది. ఆసియాలోనే అతి పెద్ద మురికివాడ ముంబైలోని ధారావి. ఇక్కడ పాకిందంటే కరోనాను కట్టడి చేయడం అసాధ్యమని దేశమంతా భావించింది. అనుకున్నట్టుగానే.. ధారావిని కరోనా మహమ్మారి చేరుకుంది. ఇంకేముంది.. వరుసగా కేసులు... ఇక కట్టడి చేయడం అసాధ్యమనే భావన అందరిలోనూ తలెత్తింది. తీరా చూస్తే అనూహ్యంగా కరోనా అక్కడ అదుపులోకి వచ్చి.. అందరి దృష్టిని ఆకర్షించింది. గత నాలుగు రోజుల్లో ఒకరోజు 12 కేసులు మినహా మిగిలిన రోజులన్నీ సింగిల్ డిజిట్‌లో కేసులు నమోదవడం విశేషం. దీంతో డబ్ల్యూహెచ్‌వో సైతం ధారావిపై ప్రశంసల జల్లు కురిపించింది.

‘‘ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 12 మిలియన్ల కేసులు నమోదయ్యాయి. గడిచిన ఆరు వారాల్లో అవి రెట్టింపయ్యాయి. అయితే కరోనా వ్యాప్తి ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నా దానిని నియంత్రణలోకి తీసుకురాగలమనే నమ్మకాన్ని ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాలు నిరూపించాయి. వాటిలో భారత్‌లోని ధారావి, ఇటలీ, స్పెయిన్, దక్షిణ కొరియా ఉన్నాయి.. ముంబై అనేది అధిక జనాభా కలిగిన మహానగరం. ఇలాంటి ప్రాంతంలో వైరస్‌ను కట్టడి చేయడం, అనారోగ్యంతో ఉన్నవారిని పరీక్షించడం, గుర్తించడం, వేరు చేయడం, చికిత్స వంటివి చాలా కీలకం’’ అని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ ప్రశంసించారు.