చిగురుపాటిని చంపిందెవరు.. ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు!
- IndiaGlitz, [Friday,February 01 2019]
తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించిన ప్రముఖ ఎన్నారై, ఎక్స్‌ప్రెస్ టీవీ చైర్మన్ చిగురుపాటి జయరామ్ హత్య కేసులో గంటకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు. అసలేం జరిగింది..? ఈ ఘటనకు పాల్పడిందెవరు..? కుటుంబ సభ్యులే చౌదరిని పొట్టనపెట్టుకున్నారా..? హైదరాబాద్ నుంచి వెంటాడి వచ్చిన వారు హత్య చేశారా? హైదరాబాద్‌లోనే హత్య చేసి తీసుకొచ్చారా? సమీప బంధువులే హంతకులా? ఇలా వివిధ కోణాల్లో విజయవాడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా జయరాంతో పాటు కారులో హైదరాబాద్ నుంచి వెళ్లిన వ్యక్తి ఎవరు? అనే విషయాలపై పోలీసుల ఆరా తీస్తున్నారు. ఎప్పుడూ ఒంటరిగా వెళ్లని జయరామ్ సెక్యూరిటీ లేకుండా ఎందుకు వెళ్లారు? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
కుటుంబ సభ్యుల విచారణ..
కాగా చిగురుపాటి హత్యకు హైదరాబాద్‌లోనే కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో మొదట ఆయన కుటుంబ సభ్యులను విచారించడం గమనార్హం. కుటుంబ సభ్యులను, బ్యాంకు అధికారులను, కారు డ్రైవర్‌ను అధికారులు ఇప్పటికే ప్రశ్నించారు. అయితే వారి నుంచి ఏం సమాచారం రాబట్టారనేది తెలియరాలేదు. మరోవైపు ఆయన మేనకోడలు శిఖా చౌదరి కోసం విజయవాడ నుంచి హైదరాబాద్‌కు రెండు ప్రత్యేక బృందాలు వెళ్లాయి. జయరాం అకౌంటెంట్ రామకృష్ణ, చౌదరి సోదరిపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. కారు డ్రైవర్ ప్రసాద్‌ను కూడా సుమారు అరగంటకుపైగా విజయవాడ పోలీసులు ప్రశ్నించారు. వీరందరి నుంచి సేకరించిన సమాచారాన్ని ఓ సీడీలో పొందుపరిచి.. శిఖా చౌదరిని విచారించిన అనంతరం మొత్తం వ్యవహారం తేల్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
30న అసలేం జరిగింది..!
30వ తేదీ మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిన జయరాం కారు 31వ తేదీ రాత్రి పంతంగి టోల్‌గేట్‌ను దాటినట్లు పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలో గుర్తించారు. ఇదిలా ఉంటే.. చిగురుపాటి జయరాం మృతదేహానికి పోస్టు మార్టం పూర్తి అయింది. మృతదేహాన్ని బంధువులకు పోలీసులు అప్పగించారు. జయరాం సోదరి మృతదేహంతో హైదరాబాద్ బయలుదేరింది. మరోవైపు సమాచారం అందుకున్న చౌదరి కుటుంబ సభ్యులు అమెరికా నుంచి బయల్దేరారు. మొత్తానికి చూస్తే మరో 24 గంటల్లో ఈ కేసు కొలిక్కి వచ్చే అవకాశముంది.