బ్లాక్ ఫంగస్ కన్నా ప్రమాదకరం.. వైట్ ఫంగస్ లక్షణాలివే..
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి వ్యాప్తిని ఎలా అరికట్టాలా.. అని తలలు పట్టుకుంటున్న ప్రభుత్వానికి కొత్తగా రకరకాల వ్యాధులు తోడవుతూ సవాల్ చేస్తున్నాయి. ఇప్పటికే బ్లాక్ ఫంగస్ దేశాన్ని వణికిస్తుంటే.. కొత్తగా వైట్ ఫంగస్ కలకలం మొదలైంది. లక్షల్లో రోజువారీ కరోనా కేసులుండగా.. మహారాష్ట్ర, రాజస్థాన్, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా బిహార్‌లో నలుగురు వ్యక్తుల్లో వైట్ ఫంగస్ బయటపడింది. వీరిలో ఒక డాక్టర్ ఉండడం గమనార్హం. అయితే బ్లాక్ ఫంగస్‌ను మించి ఈ వైట్ ఫంగస్ మనిషిని దెబ్బ కొడుతుందని తెలుస్తోంది.
బ్లాక్ ఫంగస్ కంటే ప్రమాదకరం..
కరోనా నుంచి కోలుకున్న వారిలో రోగనిరోధకత తక్కువగా ఉన్నవారు, మధుమేహులు, చికిత్సలో స్టెరాయిడ్లు వాడిన వారికి బ్లాక్ ఫంగస్ సోకుతోంది. కానీ వైట్ ఫంగస్‌కు కరోనాతో సంబంధం లేదు. ఇది బ్లాక్ ఫంగస్ కంటే ప్రమాదకరమైనది. బిహార్ కేసుల్లో.. వైట్ పంగస్ సోకినవారిలో కరోనా లేదు. వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగటివ్ రిపోర్టు వచ్చింది. కానీ, సీటీస్కాన్‌లో వైట్ ఫంగస్ ఆనవాళ్లను గుర్తించామని పట్నా మెడికల్ కాలేజీ మైక్రో బయాలజీ చీఫ్ డాక్టర్ ఎస్.ఎన్.సింగ్ తెలిపారు. ఎక్స్‌రే, సీటీస్కాన్ ద్వారా వైట్ ఫంగస్‌ను గుర్తించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: ఇకపై ఇంట్లోనే కరోనా టెస్ట్.. కిట్ ధర కూడా చాలా తక్కువే..
సరైన సమయంలో చికిత్స తీసుకోకుంటే..
కరోనా మాదిరిగానే.. వైట్ ఫంగస్ కూడా ఊపిరితిత్తులను దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ ఫంగస్ ముఖ భాగాన్ని దెబ్బతీస్తుందని, ముక్కు ద్వారా కళ్లకు, మెదడుకు ఇన్ఫెక్షన్ అవుతుంది. కానీ వైట్ ఫంగస్ అలా కాదని నిపుణులు చెబుతన్నారు. వైట్ ఫంగస్ ప్రధానంగా ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. సరైన సమయంలో చికిత్స తీసుకోకుంటే.. ఊపిరితిత్తుల నుంచి గోళ్లు, చర్మం, కడుపు, మూత్రపిండాలు, మెదడు, పునరుత్పత్తి అవయవాలు, నోటికి వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. వైట్ ఫంగస్ సోకిన వారికి సకాలంలో చికిత్స అందిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చని.. ఇందుకోసం యాంటీ-ఫంగల్ ఔషధాలను ఇవ్వాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
వీరికి ప్రమాదం ఎక్కువ..
రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలికంగా స్టెరాయిడ్స్ తీసుకుంటున్న వారు, మధుమేహ వ్యాధిగ్రస్థులు, హెచ్‌ఐవీ/ఎయిడ్స్, మూత్రపిండాల మార్పిడి చేయించుకున్న వారికి వైట్ ఫంగస్‌తో ముప్పు ఎక్కువగా ఉంటుంది. కొవిడ్ రోగులకు కూడా ఈ ముప్పు ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొవిడ్ రోగులకు ఆక్సిజన్ అందించేప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా.. వైట్ ఫంగస్ సోకే ప్రమాదం ఉంటుందని తెలియజేస్తున్నారు. ఇది కూడా బ్లాక్ ఫంగస్ మాదిరిగానే.. ఆక్సిజన్ తయారీలో కుళాయి నీళ్లు వాడితే.. వైట్ ఫంగస్ వచ్చే ముప్పు ఎక్కువ. ఆక్సిజన్ నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది కాబట్టి.. ఆ ప్రాంతంలో వైట్ ఫంగస్ వచ్చే చేరే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments