ఏ రాత్రి అందంగా ముగుస్తుందో అదే గ్రేట్ డే: పూరీ జగన్నాథ్
- IndiaGlitz, [Sunday,September 20 2020]
పూరి మ్యూజింగ్స్ పేరుతో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ..కొన్ని రోజులుగా కొన్ని అంశాలపై మాట్లాడుతున్నారు. తాజాగా ఆయన 'రాత్రి' అనే అంశంపై మాట్లాడారు. 'వేళకాని వేళలలో లేనిపోని వాంఛలతో... దారి కాని దారులలతో కానరాని కాంక్షలతో దేనికొరకు పదే పదే దేవులాడతావ్.. ఆలసించి అలమటించి పాకులాడతావ్ శ్రీనివాసరావ్' అని శ్రీశ్రీగారు చెప్పారు. చిన్నప్పుడు ఇది చదవగానే దీన్ని నాకోసమే ఆయన రాశారనిపించింది. లేనిపోని వాంచలు. ప్రతి రాత్రి నిద్రపోవడానికి ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఆలోచనలు ఆగేవి కావు. ఏంపీకుతామో తెలియదు కానీ, మనందరికీ నిద్రలు పట్టవు. కానీ ఇంటెలిజెంట్స్ అందరూ ఇలాగే ఎక్కువసేపు రాత్రిపూట మేలుకుంటారని సర్వేలో తేలింది. దాంతో హమ్మయ్యా! మనం కూడా ఇంటెలిజెంటేనని శాటిస్పాక్షన్ వచ్చింది. పగలు కన్నా రాత్రి చాలా విలువైంది. మన చుట్టూ ఉన్న మైండ్స్ అన్నీ గాఢ నిద్రలో ఉంటాయి. మనం మేల్కొని ఉంటాం. మనం మనతో కూర్చొనే అవకాశం అప్పుడే దొరుకుతుంది. నిజమైన కల ఎప్పుడూ నిన్ను నిద్రపోనివ్వదు. ఏ కలలేనివాడే ఎనిమిది గంటలకు పడుకుంటాడు. బెల్జియం యూనివర్సిటీవాళ్లు 15 గుడ్లగూబలను తీసుకుని పరీక్ష చేస్తే రాత్రిపూట మేలుకుని ఉండే గుడ్లగూబలకు ఐక్యూ ఎక్కువగా ఉంటుందని తెలిసింది. అలాగే మేడ్రిడ్ యూనివర్సిటీవాళ్లు 1000 మంది టీనేజర్స్‌ను చెక్ చేస్తే రాత్రిపూట మేలుకునే ఉండేవాళ్లే ఎక్కువ షార్ప్‌గా ఉంటారని తెలిసింది. లిస్టు బయటకు తీస్తే లేటుగా పడుకుని లేటుగా నిద్రలేచే వాళ్ల బ్యాంక్ అకౌంట్స్‌లో డబ్బు ఎక్కువగా ఉందట. పల్లెటూళ్లని త్వరగా పడుకుంటాయి కానీ.. పట్టణాలన్నీ రాత్రిపూటే నిద్రలేస్తాయి. ఎన్నో కోట్ల మంది ప్రతిరోజు రాత్రి ఎప్పుడవుతుందా? అని ఎదురుచూస్తుంటారు.
ప్రపంచంలో ఎన్నో నగరాలు ఒళ్లు విరుచుకుని నిద్రలేస్తాయి. డాన్స్ బార్లు, క్యాసినోలు, వీధినాటకాలు, నైట్ బజార్లు.. పగటిపూట చూసిన అదే పప్రంచం రాత్రిపూట మరోలా ఉంటుంది. లేట్‌నైట్ పీపుల్‌కే క్రియేటివ్ సొల్యూషన్స్ దొరుకుతాయి. కొన్ని ప్రొఫెషన్స్‌కి రాత్రే కరెక్ట్. బార్ ఓపెన్ చేసిన తర్వాతే ఒకడు పొయెట్రీ రాయడం మొదలు పెడతాడు. ఒక మ్యూజిషన్ ట్యూన్ చేయడం మొదలుపెడతాడు. రాత్రి ఎంత చిక్కగా ఉంటే అన్ని నక్షత్రాలు కనపడతాయి. ఓ థింకర్ పండు వెన్నెలచూస్తూ సముద్రంపు ఒడ్డున కూర్చుని ఉంటే ఎన్నో ఆలోచనలు అతన్ని చుట్టేస్తుంటాయి. ఇలా నిశిథిలో ఎన్నో జరుగుతుంటాయి. విరహవేదనపడుతూ తలగడతో కలిసి అటు ఇటు దొర్లేవాళ్లు, కూనిరాగం తీస్తూ మెల్లగా మత్తులోకి జారేవాళ్లు. సారేగమ కార్వాన పెట్టుకుని పాతపాటలు వినేవాళ్లు. ఎన్నిగంటలు గడిచాయో తెలియని ప్రేమికుల ఫోన్ సంభాషణలు. మంచి స్నేహితులతో లేట్ నైట్ చేసే డిస్కషన్స్ బావుంటాయి. లేట్‌నైట్ డ్రైవ్స్ బావుంటాయి. ఎందుకో తెలియదు.. రాత్రిపూట ఒకరికొకరు ఇంకా బాగా అర్థమవుతారు. కోళ్లు కూస్తున్నవేళ విటులు విశ్రమిస్తుంటారు. అలసిపోయిన పోలీసులు కళ్లు నులుముకుంటూ కనపడతారు. తెల్లవారు జామున దోసెబండి దగ్గర ఆగడాలు, వేడి వేడి ఇడ్లీ తినడాలు, మెల్లగా ఇంటికి చేరడాలు. ఇలా రాత్రి ఒక అద్భుతం. ఏ రాత్రి అయితే అందంగా ముగుస్తుందో అదే గ్రేట్ డే. జీవితంలో మరచిపోలని రాత్రిళ్లు కొన్నే ఉంటాయి. అందుకే వీకెండ్స్‌ను అందరమైన రాత్రిళ్లుగా మార్చుకుని మన ఖాతాలో వేసుకోవాలి. వీకెండ్స్ చాలా చాలా ముఖ్యమైనవి అన్నారు.