విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కనబడుట లేదు!

  • IndiaGlitz, [Monday,February 15 2021]

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.. అవడానికి కర్ణాటకకు చెందిన వ్యక్తి అయినప్పటికీ తెలుగు వారికి అత్యంత దగ్గరయ్యారు. అలాంటి ప్రకాష్ రాజ్ ఇప్పుడు కనబడుట లేదు. రియల్ లైఫ్‌లో కాదండోయ్.. రీల్ లైఫ్‌లో. ఆయనను కన్నడ వ్యక్తి అంటే ఎవరూ నమ్మరేమో.. తెలుగు ప్రేక్షకుడి మనసు అస్సలు ఒప్పుకోదేమో అన్నంతగా ఆయన తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. సినిమాలో ఏ పాత్ర ఇచ్చినా సరే అవలీలగా చేసేస్తారు. విలన్‌గా తన విశ్వరూపం చూపిస్తారు. తండ్రిగా అద్భుతమైన ఎమోషన్స్ పండిస్తారు. అన్నగా ఆకట్టుకుంటారు. ఆఫీసర్‌గా డైనమిజం చూపిస్తారు. ఏ పాత్ర ఇచ్చినా సరే దానికి ప్రాణం పోస్తారు. అందుకే ఆయనకంత క్రేజ్.

2018 వరకూ దాదాపు ఆయన లేని సినిమా లేదనే చెప్పాలి. ఆయనపై ఎన్నో కంప్లైట్స్ వచ్చాయి. అయినప్పటికీ ప్రేక్షకుల్లో ఆయనకున్న క్రేజ్ దేనిని అడ్డుకోలేకపోయింది. అందుకే ఎలాంటి బ్యాన్‌లు ప్రకాష్‌రాజ్‌పై విధించినా ఆయన సినీ అవకాశాలను మాత్రం అడ్డుకోలేకపోయాయి. ఇటీవలి కాలంలో ఆయన రాజకీయాల్లో బిజీ అయిపోయారు. బీజేపీ తీరును ఎప్పటికప్పుడు ఎండగడుతూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ వస్తున్నారు. అయినప్పటికీ వచ్చిన సినిమా అవకాశాలను మాత్రం సద్వినియోగం చేసుకుంటూనే వెళుతున్నారు. అయితే ఇటీవలి కాలంలో మాత్రం టాలీవుడ్‌లో ప్రకాష్ రాజ్‌కు డిమాండ్ తగ్గిపోయిందనే చెప్పాలి.

విలన్‌గా ఆయన ప్లేసును జగపతిబాబు రీప్లేస్ చేస్తే.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన పాత్రను రావు రమేష్ రీప్లేస్ చేస్తున్నారు. దీంతో ప్రకాష్‌రాజ్‌తో తెలుగు ఇండస్ట్రీకి పెద్దగా పని లేకుండా పోయింది. ఇండస్ట్రీ ఎప్పుడు ఎవరికి క్రేజ్ వస్తుందో.. ఎప్పుడు ఎవరికి ఉన్న క్రేజ్ కాస్తా సడెన్‌గా గాయబ్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. ఒక యాక్టర్‌ను రీప్లేస్ చేయగలిగే నటుడు.. మరిపించగలిగే నటుడు వస్తే చాలా.. ఆ యాక్టర్ ఆటోమేటిక్‌గా మరుగున పడిపోతారు. ఈ విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. అందుకే దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను చక్కగా ఫాలో అవుతారు. అయితే ప్రకాష్ రాజ్ ప్రస్తుతం ‘కేజీఎఫ్ 2’ చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి గతంలో చిన్న, పెద్ద సినిమాలని తేడా లేకుండా కనిపించిన ప్రకాష్ రాజ్.. ఇక మీదట అలా ప్రతి సినిమాలోనూ కనిపించకపోవచ్చన్నది మాత్రం అక్షరాలా నిజం.