Sharmila:అన్నతో యుద్ధానికి సై.. ఏపీసీసీ చీఫ్గా షర్మిల బాధ్యతలు స్వీకరించేది ఎప్పుడంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన వైయస్ షర్మిల.. ఆ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమయ్యారు. కుమారుడి నిశ్చితార్థం కార్యక్రమం వల్ల బిజీ అయిన ఆమె ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా అయ్యేందుకు రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో షర్మిల రాష్ట్ర పర్యటన ఖరారైంది. ఈనెల 20వ తేదీ మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఇడుపులపాయకు చేరుకుని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు. అదే రోజు రాత్రి అక్కడే బస చేయనున్నారు. అనంతరం 21 ఉదయం కడప నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.
అక్కడి నుంచి నేరుగా వియవాడలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు. తదుపరి ఆరోజు ఉదయం 11 గంటలకు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేతలతో పాటు వైసీపీకి చెందిన కీలక నేతలు కూడా హాజరుకానున్నారని తెలుస్తోంది. ఆమె బాధ్యతలు స్వీకరించగానే వైసీపీకి చెందిన పలువురు కీలక నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.
కాగా ఇటీవల వైఎస్సార్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసిన షర్మిల.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీల సమక్షంలో సొంతగూటికి చేరుకున్న సంగతి తెలిసిందే. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసి, పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే బాధ్యతలను షర్మిలకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు ఏపీసీసీ చీఫ్గా ఉన్న గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా అధిష్టానం నియమించింది. అలాగే మేనిఫెస్టోను రూపకల్పనకు కూడా కమిటీని ప్రకటించింది.
కమిటీ చైర్మన్గా కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, సభ్యులుగా మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం, తులసి రెడ్డి, కమలమ్మ, జంగా గౌతమ్, ఉషా నాయుడు, నజీరుద్దీన్, కొరివి వినయ్ కుమార్, డాక్టర్ గంగాధర్, కారుమంచి రమాదేవిలకు ఇందులో చోటు కల్పించారు. మొత్తానికి షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీని తిరిగి బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు అధిష్టానం తీసుకుంటుంది. తొలి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉన్న దళితులు, ముస్లిం మైనార్టీలు.. రాష్ట్ర విభజన నేపథ్యంలో వైసీపీ వైపు మళ్లింది. ఇప్పుడు వారిని తిరిగి హస్తం పార్టీ వైపు మళ్లించే బాధ్యత వైఎస్సార్ వారసురాలిగా కాంగ్రెస్ చీఫ్ అయిన షర్మిల మీద ఉంది. దీంతో సొంత అన్న జగన్ను ఢీ కొట్టేందుకు ఆమె సిద్ధమయ్యారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com