Pemmasani:టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే పరిశ్రమలు తీసుకొస్తాం: పెమ్మసాని
Send us your feedback to audioarticles@vaarta.com
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అరాచకాలకు భయపడి పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు భయపడుతున్నాయని గుంటూరు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్. పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. సీఎం జగన్‌కు పరిశ్రమలు తీసుకురావడం చేతకాదని విమర్శించారు. పరిశ్రమలు తీసుకురావడం అంటే పేపర్లపై సంఖ్యలు చదవడం కాదని పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపి వారికి భరోసా కల్పించాలి అని పేర్కొన్నారు. అలా భరోసా కల్పించినప్పుడే కంపెనీలు వస్తాయని.. తద్వారా యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు.
గుంటూరులోని స్థానిక అమరావతి రోడ్డులో గల A1 కన్వెన్షన్ హాల్‌లో సోమవారం జరిగిన పశ్చిమ నియోజకవర్గం నిరుద్యోగ యువత సమావేశానికి ముఖ్య అతిథిగా పెమ్మసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ లాగా తాడేపల్లి ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్తే పరిశ్రమలు రావు అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఐదేళ్లు కష్టపడి 120 సంస్థలను రాజధానికి తీసుకురావడానికి కృషి చేశారని, స్థలాలు కేటాయించి, జీవోలు కూడా విడుదల చేశారని చెప్పారు. అయితే జగన్ రాగానే సంస్థలను పరిశ్రమలను రాజధానికి రాకుండా రద్దు చేశారని వివరించారు. అందుకే వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని.. అధికారంలోకి రాగానే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
అనంతరం తూర్పు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో యువత తమ సత్తా చాటాలని తెలుగుదేశం పార్టీ నాయకులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఇప్పటికే నిరుద్యోగ భృతిని ప్రకటించిన టిడిపి అధికారంలోకి రాగానే పరిశ్రమలను తీసుకువచ్చి ఉద్యోగ అవకాశాలను అందిస్తుందని తెలిపారు.
కాగా తిరువీధి హరికృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గుంటూరు నగర పార్టీ అధ్యక్షుడు డేగల ప్రభాకర్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి వడ్రానం హరిబాబు, రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి చిట్టా బత్తిన చిట్టిబాబు, రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి మద్దిరాల మ్యాని, జిల్లా అధికార ప్రతినిధి బొబ్బిలి రామారావు తదితరులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments